– ప్రధాని ప్రకటనకే పరిమితమా?
– నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ఇదేనిజం ప్రతినిధి, నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పసుపు బోర్డు ఎక్కడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లాలో ప్రకటించిన పసుపు బోర్డు ఏర్పాటు కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మరోమారు పసుపు రైతులను బీజేపీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎంపీ అర్వింద్ మాటలు నమ్మొద్దని సూచించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసి ఆరు నెలలు గడిచిందని.. ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాలేదన్నారు. అధికారికంగా బోర్డు ఏర్పాటు కాలేదని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 85వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేదని, ప్రస్తుతం కేవలం 35 వేలకు తగ్గిందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హాందన్, జిల్లా కిసాన్ కేతు ఆధ్యక్షులు ముప్పగంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.