Homeహైదరాబాద్latest News'భారత రత్న' ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు?

‘భారత రత్న’ ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు?

ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన వారికి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమే భారత రత్న.మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, కళాకారులు, సాహిత్యకారులు తదితరులు ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. 1954 జనవరి 2న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డును ఆవిష్కరించారు. తొలి అవార్డును స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ డాక్టర్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డా. చంద్రశేఖర వెంకట రామన్‌లకు అందించారు. ఆ తర్వాత భిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన చాలా మందికి ఈ అవార్డులను అందించారు. 1954లో కేవలం జీవించి ఉండే వారికే అవార్డు ఇచ్చారు.

అయితే, 1955లో మరణానంతరం కూడా అవార్డు ఇస్తామని ప్రకటించారు.భారత గెజిట్‌ నోటిఫికేషన్ ద్వారా సదరు వ్యక్తికి భారత రత్న ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ పురస్కారాన్ని జనవరి 26న ప్రదానం చేస్తారు. భారతరత్నకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధానమంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్ ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారతరత్నకు పరిశీలించొచ్చు. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు. అయితే, ప్రతి ఏటా ఒక్కరికైనా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. ఇప్పటివరకు 50 మందికి ఈ అవార్డును ప్రకటించారు. భారతరత్న గ్రహీతలకు ఒక సర్టిఫికేట్, ఒక మెడల్‌ను భారత ప్రభుత్వం ఇస్తుంది. దీనిలో భాగంగా ఎలాంటి నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వరు. అయితే, భారతరత్న గ్రహీతలకు ప్రభుత్వం కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. రైల్వేలో ఉచిత ప్రయాణం లాంటివి దీనిలో ఉంటాయి.

ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా భారతరత్న గ్రహీతలకు ఆహ్వానం అందుతుంది. ప్రోటోకాల్‌లోనూ భారతరత్న గ్రహీతలకు స్థానం ఉంటుంది. మరోవైపు భారతరత్న గ్రహీతలకు వారి వారి రాష్ట్రాల్లోనూ గొప్పగా ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, పేరుకు ముందు ఈ అవార్డు పేరును పెట్టుకోవడానికి వీల్లేదు. అయితే, తమ రెస్యూమ్, లెటర్‌హెడ్, విజిటింగ్ కార్డుల్లో ప్రభుత్వం నుంచి ఈ అవార్డు అందుకున్నట్లు రాసుకోవచ్చు. రాగితో చేసిన రావిచెట్టు ఆకు రూపంలో ఆ పతకం కనిపిస్తుంది. దానిపై ప్లాటినంతో చెక్కిన సూర్యుడి ముద్ర ఒకవైపు ఉంటుంది. కింద హిందీలో భారత రత్న అని రాసి కనిపిస్తుంది. రెండో వైపు అశోక స్తంభం ముద్ర కనిపిస్తుంది. దాని కింద హిందీలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. 2013లో తొలిసారి స్పోర్ట్స్‌లో కూడా భారత రత్న ఇవ్వబోతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు భారత రత్న ఇచ్చారు. మదర్ థెరెసా లాంటి భారతీయేతరులకు కూడా ఈ అవార్డు ఇచ్చారు. మరోవైపు పాకిస్తాన్‌లో జన్మించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాలకు భారత రత్నను ప్రదానం చేశారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి భారతరత్న ఇవ్వొచ్చు. కేవలం పతకం, సర్టిఫికేట్ మాత్రమే ఈ అవార్డులో భాగంగా ఇస్తారు. ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు. 2024లో కర్పూరి ఠాకుర్, ఎల్‌కే అడ్వాణీలకు భారత రత్న ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఈ అవార్డులు పొందిన వారి సంఖ్య 50కి చేరింది.

Recent

- Advertisment -spot_img