ఇదే నిజం, ఖమ్మం ప్రధాన ప్రతినిధి : ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సారి ఖమ్మం పార్లమెంట్ బరిలో ఎవరు నిలుస్తారు..? టిక్కెట్ ఎవరికి దక్కనుంది.? అధిష్ఠానం ఎవరికి బీఫామ్ కేటాయిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోకసభ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ ఖమ్మంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధానంగా ఇక్కడ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావు పోటీలో నిలిచే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటికే గాంధీ భవన్ లో దరఖాస్తులు సమర్పించారు. ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క సతీమణి నందిని భారీ కాన్వాయితో వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. అయితే టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారనేది స్పష్టత లేకపోయినా.. టిక్కెట్ తమకే వస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆశావహులు కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా బీఫామ్ తెచ్చుకుని గెలువాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదువుతున్నారు. త్వరలో లోకసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుండటంతో ఖమ్మంలో రాజకీయాలు హీటెక్కాయి.
- కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్ర పోటీ..
ఖమ్మం పార్లమెంట్ జనరల్ స్థానం కావడంతో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రి పదవులు ముగ్గురు నేతల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి టిక్కెట్ ఇప్పించేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఎవరికి వారు కాంగ్రెస్ పెద్దలను కలిసి టిక్కెట్ తమకే కేటాయించాలని కోరుతున్నారు. ఇక్కడి నుంచి ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తనయుడు తుమ్మల యుగేంధర్, మంత్రి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అధిష్ఠానం మొగ్గు ఎవరి వైపు..
ఖమ్మం ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ లో సీనియర్ నాయకులతోపాటు యువనాయకులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బాండ్ రేణుకచౌదరి సైతం ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నది. అయితే, ఆమెకు రాజ్యసభ సీటు దక్కింది. ప్రస్తుతం ఆమె పోటీలో లేదని చెప్పాలి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు కూడా ఖమ్మం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, ఆయన నాన్ లోకల్ కావడంతో స్థానిక నాయకత్వం కోసం అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. అయితే, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేంధర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి ఖమ్మం ఎంపీ టిక్కెట్ కేటాయించాలని కోరడం చర్చానీయాంశంగా మారింది. దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. అంతేకాదు, యుగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన మనసులోని మాట చెప్పడంతో ఆయన నుంచి కూడా పాజిటివ్ గా స్పందన రావడంతో ఎంపీగా బరిలో నిలిచేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఖమ్మంలో రాజకీయాలు చలిలోనూ వేడి పుట్టిస్తున్నాయి.