ఈస్టర్ పండుగ రోజు ఈస్టర్ ఎగ్స్ అని పిలువబడే ప్రత్యేక గుడ్లు పంపిణీ చేస్తారు. క్రైస్తవులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈస్టర్ ఎగ్స్ తో రకరకాల ఆటలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈస్టర్ గుడ్లు దాచిపెట్టగా పిల్లలు వాటిని వెతికి తీసుకురావడంతో ఈ ఆట చాలా సంతోషంగా ఉంటుంది.
ఈస్టర్ కోసం గుడ్లను అలంకరించడం అనేది 13 వ శతాబ్దం నాటి సంప్రదాయం. ఈస్టర్ సందర్భంగా వివిధ దేశాలలో కోడిగుడ్లను రకరకాల రంగులతో అలంకరించి పెడతారు. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఈ కోడిగుడ్లు ఉంటాయి. ఈస్టర్ గుడ్లు కోసం వెతకడం అనేది అక్కడ ఆచరించే సంప్రదాయం.
దీన్ని కేవలం చిన్నపిల్లల సరదాగా ఆడుకునే ఆటగా మాత్రమే పరిగణించరు. సంతాన ప్రాప్తి కోసం చేసే ఆచారంగా భావిస్తారు. గుడ్డు దొరికితే సంతోషం, సిరిసంపదలు, మంచి ఆరోగ్యం, రక్షణ తీసుకొస్తుందని నమ్ముతారు. పిల్లలు కలగాలని కోరుకుంటూ ఈ ఈస్టర్ ఎగ్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పునరుత్పత్తికి వీటిని చిహ్నంగా భావిస్తారు.