Homeఅంతర్జాతీయంSwasthik symbol : హిట్లర్ తన పార్టీ గుర్తుగా హిందూ మత చిహ్నాం స్వ‌స్తిక్‌ను ఎందుకు...

Swasthik symbol : హిట్లర్ తన పార్టీ గుర్తుగా హిందూ మత చిహ్నాం స్వ‌స్తిక్‌ను ఎందుకు ఎంచుకున్నారు

Why Hitler used Swasthik symbol as his party symbol : స్వస్తిక పురాతన కాలం నుంచి నేటి వరకు ముఖ్యమైన మత చిహ్నంగా నిలిచింది.

అయితే, ఇతర విశ్వాసాలలో దీనిని(Swasthik symbol) అదృష్టానికి, అనంతమైన సృష్టికి, అంతులేని విజయాలకు, అలాగే సూర్యుడికి చిహ్నంగా భావిస్తారు.

కానీ, ఇది నాజీ పార్టీ చిహ్నంగా ఎలా మారింది?

పవిత్రమైన స్వస్తిక గుర్తు పరివర్తన 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమైందని చరిత్రకారుడు, రచయిత మైల్స్ రస్సెల్ రాశారు.

అయితే, దీని కథ టర్కీలోని హిసార్లిక్ అనే ప్రాంతంలో జరిగిన పురావస్తు పరిశోధనతో మొదలవుతుంది.

ఈ ప్రాంతంలోనే ట్రాయ్ యుద్ధం జరిగిందని జర్మన్ పురాతత్వవేత్త హెన్రిచ్ ష్లీమాన్ అంటారు.

స్వస్తిక గుర్తు వివిధ రకాల కళాఖండాలపై ఉన్నట్లు ష్లీమాన్ కనుగొన్నారు.

ఆరవ శతాబ్దపు జర్మనీ కుండల నమూనాలలో ఈ గుర్తును పోలిన గుర్తులను ఆయన గమనించారు.

ఇది ఒక ముఖ్యమైన, విశ్వవ్యాప్తమైన చారిత్రాత్మకమైన పూర్వపు మత చిహ్నమని ఆయన సిద్ధాంతీకరించారు.

దురదృష్టవశాత్తు, సరిగ్గా అదే కాలంలో ఏర్పడిన జర్మనీలో, కొంతమంది విద్యావేత్తలు, జాతీయవాదులు ఈ భావనను మరింత ముందుకు తీసుకెళ్లారు.

యూరప్, ఏషియా అంతటా స్వస్తిక(Swasthik symbol) ఉనికికి ఆర్యులు అనే గొప్ప జాతే కారణమని నమ్మారు.

1920ల ప్రారంభంలో, స్వస్తిక చిహ్నం జర్మన్ రీచ్‌( జర్మనీ సామ్రాజ్యం)కు సింబల్‌గా మారింది.

జాతి ద్వేషం అనే భావనతో ముడిపడిపోయిన స్వస్తికను నేడు పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కానీ, తూర్పున హిందూ, బౌద్ధ సమాజంలో ఇది పవిత్ర చిహ్నంగా ప్రజాదరణ పొందింది.

సుదీర్ఘ చరిత్ర ఉన్న స్వస్తిక, గతంలో అదృష్టానికి, నమ్మకానికి చిహ్నంగా ఉండేది.

కానీ అదే స్వస్తిక, 20వ శతాబ్దంలో ద్వేషం, భయాలకు గుర్తుగా మారింది. ఈ పరిణామాలు ఎలా జరిగాయి?

టర్కీలోని హిసార్లిక్ అనే ప్రాంతంలో ట్రాయ్ నగరం

హెన్రిచ్ ష్లీమాన్‌కు గ్రీకు పురాణాలలో వినిపించే ట్రాయ్‌ నగరం ఎక్కడుందో కనుక్కోవాలన్న ఆసక్తి ఉండేది.

ఈ నగరం గురించి తెలుసుకోవాలంటే హోమర్ రాసిన ఇతిహాసాలలో ఏదో ఒక మార్గం దొరుకుతుందని ఆయన భావించేవారు.

1868లో ఆయన ‘ది ఇలియడ్’ అనే పుస్తకం పట్టుకుని మధ్యధరా ప్రాంతంలో తన అన్వేషణ మొదలు పెట్టారు.

చాలా సంవత్సరాలు గడిచినా, పరిశోధనల్లో ఎలాంటి ఫలితం కనిపించ లేదు.

ఇక తన ప్రయత్నాలను ఆపేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

అదే సమయంలో ఫ్రాంక్ కాల్వెర్ట్ అనే బ్రిటిష్ ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త ష్లీమాన్‌కు ఒక సలహా ఇచ్చారు.

టర్కీలోని ఏజియన్ తీరంలో హిసార్లిక్ అనే ప్రాంతంలోని మట్టిదిబ్బలను తవ్వి చూడమని సూచించారు.

1870లలో, ష్లీమాన్ వేల సంవత్సరాల నాటి నాగరికతకు సంబంధించిన స్థలాలను తవ్వి, అక్కడ ఒక పురాతనమైన నగరం ఉందని, అదే ట్రాయ్ నగరమని ప్రకటించారు.

మత చిహ్నంగా స్వస్తిక(Swasthik symbol)..

అయితే, అంతకు ముందు ష్లీమాన్ ఊహించిన ట్రాయ్ నగరం కన్నా ఇది భిన్నంగా ఉంది.

అక్కడ బంగారం, వెండి, కంచు ఆభరణాలు పెద్ద మొత్తంలో కనిపించాయి.

ఇవి కూడా ఆయన ఊహించినవాటికంటే ఎక్కువ.

అక్కడే ఆయనకు వంగిన శిలువ లాంటి చిహ్నం, దానికి సంబంధిన 1800 వర్ణనలు దొరికాయి.

ష్లీమాన్ పరిశోధనా ఫలితాలు విస్తృతంగా వ్యాపించాయి.

చాలామంది స్వస్తికను(Swasthik symbol) ఒక మత చిహ్నంగా అనుసరించడం మొదలుపెట్టారు.

ఇది యూరప్, ఉత్తర అమెరికా అంతటా కనిపించే ఒక సర్వవ్యాప్త చిహ్నంగా మారింది.

ప్రకటనలు, భవన నిర్మాణం సమయంలో చేసే పూజలు, బ్యాడ్జ్‌లు, మెడల్స్ మీద కూడా స్వస్తిక కనిపించడం మొదలైంది.

ఐస్ హాకీ నుంచి బాస్కెట్‌బాల్ వరకు స్టోర్ట్స్‌జట్లు కూడా తమ టీమ్‌కు స్వస్తిక్ అనే పేరు పెట్టుకున్నారు.

ఈ చిహ్నం అదృష్టానికి, విజయానికి గుర్తుగా మారిపోయింది.

అదే సమయంలో స్వస్తిక సుదీర్ఘ చరిత్ర జర్మన్ జాతీయ వాదులకు ఆసక్తికరంగా మారింది.

జర్మన్లు తాము ‘ఆర్యులు’ అనే ఉన్నత జాతికి చెందినవారమనే ఒక కల్పిత భావనను నమ్మడం మొదలు పెట్టారు.

ఈ నమ్మకం 20వ శతాబ్దం వరకు కొనసాగింది.

అప్పడే ఎదుగుతున్న నాజీ పార్టీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు కూడా ఈ సిద్ధాంతం నచ్చడంతో ఇది మరింత ప్రమాదకరమైన సిద్ధాంతంగా మారసాగింది.

హిట్లర్ 1920లో తన పార్టీకి, ఉద్యమానికి చిహ్నంగా స్వస్తికను(Swasthik symbol) స్వీకరించాడు.

అది ద్వేషానికి కూడా చిహ్నంగా మారింది. భయానికి, జాతి విద్వేషానికి, మారణహోమానికి, చెడుకు ప్రతిరూపమైంది.

కేవలం కొన్ని సంవత్సరాలలోనే స్వస్తికకు ఉన్న పవిత్రత కాస్త చెడ్డ పేరుగా మారిపోయింది.

వేల సంవత్సరాలుగా అనేక సంస్కృతులకు ఆలంబనగా నిల్చిన ఆ గుర్తు పవిత్రత తిరగబడింది.

వాస్తవానికి స్వస్తిక అనే పదం సంస్కృత స్వస్తిక నుండి వచ్చింది. దీని అర్థం “శ్రేయస్సును కలిగించేది” అని .

స్వస్తిక చరిత్ర ఏంటి?

స్వస్తికకు సుమారు 15,000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1908లో ఉక్రెయిన్‌లో దొరికిన ఒక దంతపు బొమ్మ శరీరంపై స్వస్తిక లాంటి గుర్తులు ఉన్నాయి.

ఇది సంతానోత్పత్తి కి చిహ్నంగా ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

స్వస్తిక డిజైన్ మొదట ఎలా వచ్చిందో తెలియకపోయినా, ఒక అందమైన రేఖా గణిత ఆకారంలా దీన్నిరూపొందించారు.

తూర్పు యూరప్‌లో కూడా స్వస్తికలు నియోలిథిక్ కాలంనాటి కొన్ని సంస్కృతులలో కనిపించాయి.

వీటి వయసు దాదాపు 7,000 సంవత్సరాలు.

ఇల్లిరియన్ సంస్కృతిలో స్వస్తిక సూర్యుడిని సూచిస్తుంది. మెసపుటోమియా నాణేలపై కూడా ఇది ఉంటుంది.

గ్రీస్‌లో కుండీలపైనా, దుస్తుల పైనా స్వస్తిక ఉంది.

రోమ్‌లో మొజాయిక్ శిలల మీద కూడా ఇది ఉంది. సెల్టిక్ డిజైన్‌లో శైలీకృత శిలువగా దర్శనమిస్తుంది.

1857లో లండన్‌లో దొరికిన ఇనుప యుగం నాటి బాటర్‌సీ షీల్డ్‌పై 27 స్వస్తిక బొమ్మలు ఉన్నాయి.

అయితే అంతకు చాలాకాలం ముందే అంటే సుమారు 2000 సంవత్సరాల కిందటివైన ఈ చిహ్నాలు బ్రిటన్‌లోని ఇల్‌క్లీ మూర్, యార్క్‌షైర్‌లలో కనిపించాయి.

క్రైస్తవ మతంలో స్వస్తిక( Swasthik symbol )

శిలువ లోని నాలుగు చివరలనూ 90 డిగ్రీల కోణంలో వంచితే అది స్వస్తిక లాగే కనిపిస్తుంది.

స్వస్తికను యూరప్ అంతటా ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి.

దీనిని గామాడియన్, ఫైఫ్‌లోట్ అనే పేర్లతో పిలిచేవారు. అప్పుడప్పుడు మతపరమైన చిహ్నాలలో కూడా దీనిని చిత్రించేవారు.

క్రైస్తవ చిత్రలేఖనంలో జీసస్‌ను శిక్షించిన శిలువను మృత్యువుపై క్రీస్తు సాధించిన విజయంగా వర్ణించారు.

అయితే ఎడమవైపు సూచించే స్వస్తికను నార్స్ దేవుడు థోర్‌ ఉపయోగించే సుత్తిగా వర్ణించారు.

మధ్యయుగ కాలంలో ప్రసిద్ధ చిహ్నంగా ఉన్న స్వస్తిక 12వ శతాబ్దానికి చెందిన చర్చ్‌ల పై గీసిన బొమ్మలు, వస్త్రాలపై స్పష్టంగా కనిపిస్తుంది.

ఆస్ట్రియాలో అడాల్ఫ్ హిట్లర్ చదివిన లాంబాచ్ అబే స్కూల్లో రాళ్ల మీదా, చెక్కల మీద స్వస్తిక చిహ్నాలు ఉన్నాయి.

ఉత్తర ఆఫ్రికా అంతటా అనేక సంస్కృతులలో ఇది కనిపించింది.

ఆధునిక ఇథియోపియాలోని చర్చిలలో కిటికీల అలంకరణలలో, దక్షిణ, మధ్య అమెరికాలోని మయన్, అజ్‌టెక్, కునా నాగరికతల లోనూ ఇది కనిపిస్తుంది.

నవాజో, హోపి, పస్మాక్వొడి వంటి అమెరికా, ఉత్తర అమెరికాలోని ఆదిమ జాతికి చెందిన తెగలు కూడా ఈ చిహ్నాన్ని స్వీకరించాయి. వారు దీనిని ‘విర్లింగ్ లాగ్స్’ అని పిలిచేవారు.

స్వస్తికలు అనేక మతాలలో ప్రబలంగా ఉన్నాయి. హాంకాంగ్‌లోని టెన్‌ థౌజండ్ బుద్ధాస్ ఆశ్రమంలో బుద్ధుని ఛాతీపై చిన్న స్వస్తిక ఉంది.

క్రీస్తు పూర్వం నుంచే స్వస్తికను పూజిస్తున్న హిందువులు

స్వస్తిక కు, ఆసియా ఖండానికి విడదీయరాని అనుబంధం ఉంది.

ముఖ్యంగా ఇండియాలోని హిందూ, బౌద్ధ, జైన మతాల వారు దీనిని వేల సంవత్సరాలుగా పవిత్ర చిహ్నంగా కొలుస్తున్నారు.

జైనులు స్వస్తికను 24 తీర్థంకరులో ఒకరిగా భావిస్తారు. బౌద్ధులు ఈ చిహ్నాన్ని బుద్ధుని పాదముద్రలుగా భావిస్తారు.

హిందువులు కుడి చేతివైపు తిరిగి ఉండే స్వస్తికను సూర్యుడికి, శుభానికి ప్రతీకగా క్రీస్తు పూర్వం 500 నుంచి భావించడం కనిపిస్తుంది.

గృహప్రవేశాలు, సమర్పణలు, వేడుకలు, పండుగలు, ఖాతా పుస్తకాలపై తరచూ ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తుంటారు.

ఇక ఎడమ చేతి స్వస్తికను రాత్రికి చిహ్నంగా, కాళికా దేవికి ప్రతీకగా భావిస్తారు.

నాజీల కారణంగా పాశ్చాత్య దేశాలలో ఈ చిహ్నానికి చెడ్డ పేరు ఉన్నా తూర్పు దేశాలలో ఈనాటికీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఋగ్వేదాన్ని అధ్యయనం చేసిన ఎమిలీ-లూయిస్ బర్నౌఫ్

1870లలో హెన్రిచ్‌ ష్లీమాన్ ట్రాయ్‌ నగరంలో స్వస్తికను కనుగొన్న తర్వాత అది వేల సంవత్సరాల పాటు అదృష్టానికి, నమ్మకానికి చిహ్నంగా కొనసాగినట్లు తేలింది.

కానీ, ఆధునిక కాలంలో ఫాసిజం కారణంగా అది ద్వేషానికి సంకేతంగా మార్చింది.

తాను కనుగొన్న వస్తువులలో స్వస్తికకు సంబంధించిన 1800 నిర్వచనాలను బట్టి అది పూర్వీకుల మత పరమైన చిహ్నంగా ష్లీమాన్ తేల్చారు.

కానీ, ఆయన సహోద్యోగి ఎమిలీ-లూయిస్ బర్నౌఫ్ దీనికి భిన్నమైన ఆలోచన చేశారు.

భారతదేశంలో ఈ చిహ్నం ఉందని తెలుసుకున్న ఆయన ఋగ్వేదాన్ని అధ్యయనం చేశారు.

తద్వారా స్వస్తిక కు, ఆర్యులకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.

తెలుపు రంగు గల ఒక జాతి భారతదేశం వంటి భూభాగాలను జయించి, స్వస్తికను వారితోపాటు తీసుకుని వచ్చిందని చెబుతారు.

ఆర్యన్ అనే పదం స్వస్తిక లాగే సంస్కృతం నుండి ఉద్భవించింది.

జర్మనీలో ఆరవ శతాబ్దానికి చెందిన కుండలపై స్వస్తికలు కనిపించాయి.

ఆర్యులు జర్మనీ నుండి వచ్చారనడానికి రుజువుగా సంస్కృతం, జర్మన్‌ల మధ్య పోలికలను చరిత్రకారులు, పండితులు విశ్లేషించారు.

కానీ ఈ ‘స్వచ్ఛమైన’ జాతి అనే భావన ఒక అపార్థం నుంచి పుట్టుకొచ్చింది.

ఆర్య (ārya) అనే సంస్కృత పదానికి అర్ధం “గౌరవనీయమైన, గౌరవప్రదమైన లేదా గొప్ప” అని అర్ధం.

ఇది సామాజిక, భాషా వ్యత్యాసాలను మాత్రమే సూచిస్తుంది తప్ప ప్రత్యేక జాతి లేదా సమూహాన్ని సూచించదు.

కానీ ఆర్యుల ఉనికి సిద్ధాంతం 19వ శతాబ్దం మధ్యకాలం నుండి ప్రజాదరణ పొందింది.

1871లో జర్మనీ ఏకీకరణ జరిగిన సమయంలోనే ష్లీమాన్ ట్రాయ్‌ నగరం పై పరిశోధనలో ఉన్నారు.

అదే సమయంలో దేశంలో మొదలైన జాతీయవాదం జర్మన్లు ఆర్యుల నుండి వచ్చారనే ఆలోచనకు దారి తీసింది.

ట్రాయ్‌లో దొరికిన స్వస్తిక చిహ్నం తాము ఉన్నత జాతివారమని చెప్పడానికి నిరూపణగా జర్మన్ జాతీయవాదులు ఉపయోగించుకున్నారు.

యూరప్, ఉత్తర అమెరికా అంతటా స్వస్తికను ఉపయోగించడం ఉన్నా, అది జర్మనీ జాతీయవాదానికి, సెమిటిక్ వ్యతిరేకవాద గ్రూపులకు చిహ్నంగా మారింది.

హిట్లర్ స్వస్తికను ఎందుకు ఎంచుకున్నారు?

అది అడాల్ఫ్ హిట్లర్ అప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న కాలం అది.

తన నాజీ ఉద్యమానికి, జర్మనీకి బలమైన భవిష్యత్తు సూచించే చిహ్నం కోసం ఆయన వెతుకున్న సమయంలో, స్వస్తిక ఒక మంచి ఆప్షన్‌లా కనిపించింది.

ఆ చిహ్నం చరిత్రను తెలుసుకున్న హిట్లర్, అది నాజీ ఆదర్శాలకు ఒక చారిత్రక పునాదిని ఇస్తుందని గుర్తించారు.

జర్మనీ దేశపు క్రైస్తవ చరిత్రను, ఆ మతానికి యూదులకు ఉన్న సంబంధాలను హిట్లర్ పటిష్టం చేయలేకపోయారు.

క్రీస్తు కూడా స్వయంగా యూదుడే. అందుకే హిట్లర్ తన ప్రత్యేక చిహ్నంతో జర్మన్లు ఉన్నతమైన శ్వేత జాతియులనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా విశ్వసించి, పాటించారు.

1934 న్యూరేమ్‌బెర్గ్ ర్యాలీలో హిట్లర్ ఇంపీరియల్ జర్మన్ కలర్స్‌లో స్వస్తిక చిహ్నాన్ని ధరించారు.

1920లో స్వస్తిక నాజీ పార్టీ చిహ్నంగా మారింది. జెండా రూప కల్పన తనదేనని హిట్లర్ స్వయంగా చెప్పుకున్నారు.

ఇది పాత జర్మన్ ఇంపీరియల్ జెండాలోని ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో ఉంటుంది.

ఇది జర్మనీ గతాన్ని దాని భవిష్యత్తుతో అనుసంధానించడానికి హిట్లర్ చేసిన ప్రయత్నం.

ఈ రంగులకు ఆయన కొత్త అర్ధాలు చెప్పారు. “ఎరుపు రంగు సామాజిక ఉద్యమానికి, తెలుపు రంగు జాతీయవాదానికి, స్వస్తిక ఆర్య జాతి యోధుడి లక్ష్యానికి సూచిక” అని 1925లో ఆత్మ కథ మీన్ కాంఫ్‌లో హిట్లర్ రాసుకున్నారు.

1935 సెప్టెంబర్ 15న న్యూరేమ్‌బెర్గ్‌లో జరిగిన ర్యాలీ సందర్భంగా దీనిని జాతీయ జెండాగా ప్రకటించారు.

అదే రోజున, జర్మన్లు యూదుల మధ్య వివాహాలపై నిషేధం ప్రకటించారు.

జర్మన్ రక్తం ఉన్నవారు మాత్రమే రీచ్ ( సామ్రాజ్యం) పౌరులుగా ఉండవచ్చంటూ ద్విజాతి చట్టాన్ని ఆమోదించారు.

దీంతో స్వస్తికను మత సామాజిక సాంస్కృతిక చిహ్నం నుంచి లాగేసుకునే కార్యక్రమం పూర్తయింది.

నాజీ అజెండాలో ఉండే దురుద్దేశాలకు స్వస్తిక నిదర్శనంగా నిలిచింది.

ఈ చిహ్నం కింద అతి క్రూరమైన చర్యలు, దారుణాలు, యుద్ధాలు జరిగాయి.

యూదుల మీద జరిగిన మారణహోమంలో దాదాపు 60 లక్షలమంది హత్యకు గురయ్యారు.

అడవిలో స్వస్తికలు

నాజీల ప్రచారం ఆఖరికి అడవులలో కూడా ప్రతిఫలించింది.

1992లో ఓ జర్మన్ ల్యాండ్‌స్కేపింగ్ కంపెనీలో పని చేసే ఓ ఇంజినీర్, నీటిపారుదల మార్గాల కోసం బ్రాండెన్‌బర్గ్ అడవి నుంచి తీసిన ఏరియల్ ఫొటోలను పరిశీలిస్తుండగా ఆయనకు ఒక విషయం తెలిసింది.

పచ్చని పైన్ చెట్లతో నిండిన ప్రాంతంలో 140 లార్చ్‌ చెట్లు ఉన్నాయి.

రుతువుల కారణంగా అవి పసుపు-గోధుమ రంగులోకి మారాయి. పై నుంచి చూసినప్పుడు ఇవన్నీ స్వస్తిక ఆకారంలో కనిపించాయి.

ఇది యాధృచ్ఛికంగా జరిగింది కాదు. నాజీల హార్టికల్చర్ ప్రాపగాండాలో ఒక భాగం.

హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మద్దతుదారులు 1930లలో ఈ చెట్లను నాటారు.

శరదృతువులో మాత్రమే లార్చ్‌లు రంగు మారడం వల్ల ఈ ‘ పారెస్ట్ స్వస్తిక’ దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది.

అయితే, ఈ ప్రాంతంలో స్వస్తిక ప్రదర్శనపై నిషేధం ఉన్నా, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల నుంచి మాత్రమే ఇది కనిపిస్తుంది.

ఈ అడవి నయా-నాజీలకు ఒక యాత్రాస్థలంగా మారే ప్రమాదం ఉందన్న భయంతో అప్పటి ప్రభుత్వం ఈ లార్చ్ చెట్లను చాలా వరకు తొలగించింది.

1970లలో హెస్సేలో ఇలాంటిదే ఒకటి గుర్తించారు. ఇక్కడి చెట్లు 1933 ఆకారంలో కనిపిస్తాయి.

(1933లో హిట్లర్ జర్మన్ ఛాన్సలర్‌ అయ్యారు)

2006లో కిర్గిజ్‌స్తాన్‌లో ఓ కొండపై 180 మీటర్ల వెడల్పులో పెద్ద స్వస్తిక కనిపించింది.

బహుశా ఇది సోవియట్ యూనియన్ చేతికి చిక్కిన జర్మన్ యుద్ధ ఖైదీల పని కావచ్చని భావిస్తున్నారు.

చిహ్నంగా స్వస్తిక నేటి స్థానం ఏంటి ?

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, స్వస్తికను బహిరంగంగా ప్రదర్శించడాన్ని జర్మనీలో నిషేధించారు.

పాశ్చాత్య ప్రపంచంలో దానిపట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ, రైటిస్ట్ సిద్ధాంతాలకు, శ్వేతజాతి ఆధిపత్య వాదానికి అది చిహ్నంగా కొనసాగుతోంది.

అమెరికాలో స్వస్తిక చిహ్నంపై ఎలాంటి నిషేధం లేదు.

ఈ మధ్య కాలంలో అమెరికలో స్వస్తిక జెండాలను ఎగరవేయడం తరచూ కనిపిస్తోంది. 2017లో వర్జీనియాలోని చార్లోట్స్ విల్లే లో నయా-నాజీలు ర్యాలీ నిర్వహించారు.

భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాలలో స్వస్తిక కనిపిస్తుంది.

ఆలయ ప్రవేశాల నుండి టాక్సీల వరకు, వేడుకలు, పండుగలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

హిందువులు, బౌద్ధులు, జైనులకు స్వస్తిక ఆరాధనీయ చిహ్నం.

దీపావళి సందర్భంగా హిందువులు స్వస్తికను రంగురంగుల ముగ్గుల రూపంలో గీస్తారు

2007లో జర్మన్ రాజకీయ నాయకులు యూరోపియన్ యూనియన్ అంతటా స్వస్తిక నిషేధాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, హిందువులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఒకప్పుడు మంచికి, శుభానికి ప్రతీకగా నిలిచిన స్వస్తికను హిట్లర్, ఆయన సిద్ధాంతాలను నేటికి మద్ధతు తెలిపే వారి నుంచి తిరిగి తీసుకోవడం సాధ్యమవుతుందా?

ఈ చిహ్నాన్ని తిరిగి పొందడం థర్డ్ రీచ్(హిట్లర్ నేతృత్వంలోని భావి జర్మన్ సామ్రాజ్యం)కు, అది ప్రవచించిన ద్వేషానికి ఓటమి అవుతుందా? అది అసాధ్యమా? ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి.

స్వస్తిక అనేది 20శతాబ్దంలో ఒక భయానక పాలనకు ప్రతి రూపం.

కానీ, ఇది మంచిది కాదు అనే ఒకే భావనతో ఉండటం కూడా సరికాదు.

ప్రతి విషయానికి మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. అవి రెండూ మన చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుతో అనుసంధానమై ఉంటాయి.

ఒకటి మనిషిలోని దుర్మార్గాన్ని సూచిస్తుంది. రెండోది మనిషిలోని మహనీయత్వాన్నీ సూచిస్తుంది.

Recent

- Advertisment -spot_img