వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రజలకి తెలుసు అన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు. తన తండ్రి హత్యను రాజకీయంగా జగన్ వాడుకున్నారని అన్నారు. ఐదు ఏళ్లు ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీ అవినాష్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని సీఎం జగన్‌కు భయమా? ఆయన ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని, దీని నుంచి బయటకొస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
తాను, వైఎస్ షర్మిల ఇతరుల ప్రభావంతో మాట్లాడుతున్నామని అంటున్నారని ఆమె ఫైర్ అయ్యారు. వివేకా హత్య జరిగిన తర్వాత సీఎం జగన్ తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని అన్నారు. గతంతో సీఎం జగన్‌ని గుడ్డిగా నమ్మానని, చెప్పినట్టు చేశానని తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసనన్నారు. వివేకా హత్యకు సంబంధించి అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్లేదని, సీఎంగానైనా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు.