ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చేసింది. దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నుంచి జీవో నెం. 31 విడుదలయ్యింది.
ఇప్పటికే ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ బోధన, డిగ్రీ స్థాయిలో పూర్తిగా ఇంగ్లీష్‌కే పరిమితం చేయడం వంటి నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.
ఇప్పుడు తెలుగు అకాడమీ పేరు మార్పు కూడా అదే రీతిలో కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు.
ప్రభుత్వం మాత్రం తెలుగుతో పాటుగా సంస్కృతం కూడా అభివృద్ధి చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తోంది.
సంస్కృతం – హిందీ – తమిళం – తెలుగు… ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
హిందీ
సుదీర్ఘ చరిత్ర కలిగిన అకాడమీ
ఉన్నత విద్యలో తెలుగు భాషను ప్రోత్సహించే లక్ష్యంతో 1968 ఆగష్టు 6న తెలుగు అకాడమీ ప్రారంభించారు
బోధనా భాషగానే కాకుండా, పాలనా భాషగా తెలుగును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహరావు ఆధ్వర్యంలో అకాడమీ ప్రారంభమైంది.
ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా ఈ అకాడమీ ఆవిర్భవించింది.
ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలలో తెలుగు మాధ్యమ పుస్తకాల ముద్రణతో పాటుగా భాషాభివృద్ధిలో విశ్వవిద్యాలయాలతో కలిసి అనేక కార్యక్రమాలకు అకాడమీ శ్రీకారం చుట్టింది.
దానికి అనుగుణంగా పాలనా సౌలభ్యం కోసం మూడు విభాగాలుగా తెలుగు అకాడమీ పనిచేస్తోంది.
పరిశోధనా శాఖ, బోధనా శాఖ, ముద్రణా శాఖలుగా తెలుగు అకాడమీ విధులు నిర్వహిస్తున్నారు.
తెలుగు భాషకు సంబంధించి వివిధ అంశాల్లో పరిశోధన ఈ అకాడమీ ఆధ్వర్యంలో సాగింది. పారిభాషిక పదకోశాలను, వివిధ రకాల నిఘంటువులను వెలువరించింది.
ఈ అకాడమీ ద్వారా తెలుగు భాషను ఆధునీకరించి ప్రామాణీకరించే ప్రయత్నం జరిగింది. తెలుగులో 1950 వరకూ వెలువడిన సాహిత్య సంగ్రహాలను ముద్రించింది.
గిరిజన పరిశోధనా సంస్థ సహకారంతో గోండి, కోయ తెగల భాషాధ్యయనం చేసి, వాటికి తెలుగు లిపి వాచకాలు కూడా సిద్ధం చేశారు.
బోధనా శాఖ ఆధ్వర్యంలో తెలుగు మాతృభాషగా లేని వయోజనులకు తెలుగు భాష నేర్పించే ప్రయత్నం జరిగింది.
ఒకటి నుండి ఏడవ తరగతి వరకూ విద్యార్థుల శబ్ద సంపద పరిశీలన చేసి పట్టికలను తయారు చేశారు. ప్రయోగశాలలు ఏర్పాటు చేసి శిక్షణ అందించారు.
ముద్రణ శాఖ తరుపున ఇంటర్ విద్యార్థుల కోసం అన్ని గ్రూపులకు సంబంధించి తెలుగుతో పాటుగా ఇంగ్లిషు మాధ్యమాల పుస్తకాలను ముద్రించారు.
డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తూ వచ్చింది.
తెలుగు అకాడమీ తరపున 1973 నుంచి “తెలుగు” అనే పేరుతో త్రైమాసిక పత్రిక కూడా నడిచింది.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం పలు పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు.
ఇంటర్మీడియట్ తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు.
ఎన్టీఆర్ హయంలో తెలుగు అకాడమీకి ప్రాధాన్యం పెరిగింది. కార్యక్రమాలు విస్తరించాయి. తెలుగు భాషోద్దరణ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
తెలుగు అకాడమీ పేరు మార్చుతూ జారీ అయిన జీఓ
రాష్ట్ర విభజనతో కుంటుపడిన కార్యక్రమాలు
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి రావడంతో తెలుగు అకాడమీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇరు రాష్ట్రాల్లోనూ తగిన ప్రాధాన్యత దక్కలేదని తెలుగు భాషాభిమానుల అభిప్రాయం.
చివరకు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల క్రితం తెలుగు అకాడమీ చైర్మన్‌గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు.
కానీ కరోనా సహా వివిధ కారణాలతో తెలుగు అకాడమీ కార్యక్రమాలు ముందుకు సాగలేదు.
అదే సమయంలో వివిధ స్థాయిల్లో ఇంగ్లిషు మీడియం చదువులకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఇటీవల డిగ్రీ స్థాయిలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంగా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతకుముందు ప్రాథమిక విద్యలో ఇంగ్లిషు మీడియం వివాదం న్యాయస్థానాల వరకూ వెళ్లింది.
దానికి ముందే ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యా రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాల ముద్రణకే పరిమితం అయ్యింది.
పరిశోధనా, బోధనా శాఖల పని మరింత కుంటుపడుతూ వచ్చింది.
తెలుగుతో సంస్కృతాన్ని కలిపి అకాడమీ
వైఎస్ జగన్ ప్రభుత్వం తాజా జీవో ప్రకారం తెలుగు అకాడమీ పేరును మార్చేసింది. తెలుగు అకాడమీ పేరును ‘తెలుగు, సంస్కృత అకాడమీ’గా పేర్కొంది.
అదే సమయంలో అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురిని నియమించింది.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష అధ్యాపకుడు డాక్టర్ నెరేళ్ల రాజ్‌కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం విజయశ్రీ, ఎస్‌ఆర్‌ఎస్‌వి బీఈడీ కాలేజికి చెందిన లెక్చరర్ కప్పగంతు రామకృష్ణను అకాడమీ బోర్డులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ మురళీధర శర్మను యూజీసీ నామినీగా నియమించింది.
ఇక, తెలుగు- సంస్కృత అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
ఈ నిర్ణయం సరికాదని కొందరు తెలుగు భాషాభిమానులు అభ్యంతరాలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జీవీఎల్ నరసింహరావు కూడా దానిని తప్పుబట్టారు.
అభ్యుదయ రచయితల సంఘం సహా వివిధ భాషా, సాంస్కృతిక సంస్థలు కూడా అభ్యంతరం చెబుతున్నాయి.
కానీ ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతి మాత్రం తెలుగుతో పాటు సంస్కృతం కూడా అభివృద్ధి చేస్తుంటే అందరూ అభినందించాలి అన్నారు.
పేరు మార్పు చట్టం ప్రకారం చెల్లదు..
తెలుగు అకాడమీ పేరు మార్చడం చట్టం ప్రకారం చెల్లదని తెలుగు భాషావేత్త సామల రమేష్ బాబు అంటున్నారు.
ప్రభుత్వం తెలుగు భాషని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారని చెబుతున్నారు.
‘‘తెలుగు అకాడమీకి విలువైన చరిత్ర ఉంది. ఎన్నో నిధులున్నాయి. సంస్కృత భాషలో పరిశోధన కోసం తిరుపతిలో యూనివర్సిటీ కూడా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుని అభివృద్ధి చేయాలే తప్ప సంస్కృతంతో ముడిపెట్టడం తగదు. 1969 నాటి చట్టం ప్రకారం ఈ మార్పు చెల్లదు.
అంతకుముందే కేంద్రం రాజ్యాంగం ప్రకారం రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం తెలుగు అకాడమీ ఏర్పాటయ్యింది.
ఇది కేవలం పేరు మార్పు అంటూ కొందరు పేర్కొనడంలో వాస్తవం లేదు.
తెలుగు అకాడమీలోనే కాకుండా ఏపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా తెలుగు భాషకు అన్యాయం జరుగుతోంది.
ఇలాంటి ప్రయత్నాలు ప్రజలు హర్షించరు’’అని ఆయన బీబీసీతో అన్నారు.
తెలుగు అకాడమీకి ప్రస్తుతం రూ. 250 కోట్ల వరకూ వివిధ రూపాల్లో ఆస్తులున్నాయని భాషా సంఘాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రభుత్వ వాటా ప్రకారం 58 శాతం రావాల్సి ఉండగా, అకాడమీ పేరు మారిస్తే అవి పూర్తిగా చేజారిపోతాయనని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేరు మారిస్తే తెలుగుకి అన్యాయం అంటారా?
సంస్కృతం నుంచి తెలుగు భాష వచ్చినప్పుడు రెండూ కలిపి అభివృద్ధి చేయడంలో తప్పు లేదని తెలుగు పరిపాలనా మండలి అధ్యక్షులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
తాజాగా తెలుగు సంస్కృత అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ గా నియమితులయిన వారిలో ఆయన ఒకరు.
అకాడమీ పేరు మారిస్తే తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందనడంలో హేతుబద్ధత లేదని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలుగు అకాడమీకి నిధులు రావాల్సి ఉంది. కొన్నాళ్లుగా దానిని విస్మరించారు.
వివాదం కోర్టులో కూడా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం దానికోసం ప్రయత్నిస్తోంది. దాంతో పాటుగా సంస్కృతం కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది.
దానిలో తప్పుబట్టడానికి ఏముంది. తెలుగుని నిర్లక్ష్యం చేసినా, తెలుగుకి ప్రాధాన్యం లేకపోయినా ప్రశ్నించవచ్చు.
ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. కానీ అకాడమీ పేరు మార్పు విషయాన్ని వివాదం చేయడం వెనుక కారణాలు అంతుబట్టడం లేదు’’అని ఆయన అన్నారు.
సంస్కృతం కోసం కొత్తగా అకాడమీ పెట్టవచ్చుగా…
ప్రపంచంలో ఎవరికీ మాతృభాషగా కూడా లేని సంస్కృతానికి ప్రాధాన్యమివ్వడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సంస్కృతాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉండగా ఏపీ ప్రభుత్వం దానికి వంత పాడుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఒకప్పుడు తెలుగు సాహిత్యం మీద సంస్కృతం పెత్తనం చేసింది. క్రమంగా ఆధునిక సాహిత్యంలో దాని ప్రభావం తగ్గింది.
వ్యవహారిక భాషోద్యమంతో తెలుగు ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది.
అలాంటి సమయంలో ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకి బదులుగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టి ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఇచ్చారు.
దాంతో అనేక మంది పిల్లలు తెలుగు సబ్జెక్టుని వదిలేయడానికి కారణమయ్యారు.
ఇప్పుడు తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలపడం అసంబద్ధం. తెలుగు భాష ప్రాధాన్యాన్ని తగ్గించే ఈ ప్రయత్నం ఏమాత్రం సహించరానిది.
తెలుగు భాషాభిమానులను కలవరపరుస్తోంది. కావాలంటే సంస్కృతం కోసం విడిగా అకాడమీ పెట్టుకునే అవకాశం ఉంది.
తెలుగు అకాడమీలో మాత్రం కలపడం తగదని భావిస్తున్నాం’’అని అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ తెలిపారు.
ఆ మేరకు అరసం తరుపున సీఎం కి లేఖ రాసినట్టు ఆయన వివరించారు.
ఏపీలో రానురాను తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. విశాఖలో తెలుగు దండు సంస్థ ఆందోళనకు కూడా పూనుకుంది.
తెలుగుతల్లి విగ్రహం ఎదురుగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విధాన నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది.
కానీ, ప్రభుత్వం మాత్రం జీవో విడుదల చేసిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు దిశలో అడుగులు వేస్తోంది.
భాషా, సాంస్కృతిక సంస్థలే కాకుండా రాజకీయంగానూ చర్చనీయాంశం అయిన తరుణంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.