ఇదేనిజం, ధర్మపురి: ఎండాకాలం కదా సల్లగా బీర్లు తాగుదామని అనుకుంటే ధరలు పట్టపగలే సుక్కలు చూపిస్తున్నయ్. ధర్మపురి నియోజకవర్గంలోనీ కొత్తపేట, ఎండపల్లి, రాజరాంపల్లి, వెల్గటూర్, ధర్మారం వైన్స్ షాప్ లలో అసలు ఏ వైన్ షాప్ కు వెళ్లినా బీర్లు దొరకడం లేదు.మందుబాబులకు లైట్ బీర్లు, స్ట్రాంగ్..ఏవి అందుబాటులో ఉండటం లేదు. అసలే స్టాక్ రావడం లేదా అంటే.. వస్తున్నా.. వైన్ షాప్ నిర్వాహకులు మాత్రం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. వైన్ షాప్ లకు బీర్లు వచ్చాయని తెలియగానే బెల్ట్ షాప్ నిర్వాహకులు వచ్చి ఎగబడుతున్నారు.ఎన్ని ఉంటే అన్ని తీసుకుని పోతున్నారు.
దీంతో వైన్ షాపులకు ఎన్ని బీర్లు వచ్చినా బెల్ట్ షాపులకే తరలిస్తున్నారు. దీంతో సల్లని బీర్ తాగలేక మందుబాబుల బెంబేలెత్తుతున్నారు. వైన్ షాప్ లో దొరకని బీర్లు గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో దొరుకుతున్నాయి. ఈ దందా కు వైన్ షాపు నిర్వాహకులే ప్రాధాన్యతను ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటనేది తెలియకుండా ఉంది. ఏ వైన్స్ షాప్ ముందు చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. బెల్ట్ షాపులు.. బార్ లోమాత్రమే బీర్లు దొరుకుతున్నాయి. అవి కూడా బీర్ కు రూ. 50 ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలా వైన్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు అమ్ముతున్నా.. కొరత ఏర్పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మ కునీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని మందుబాబులు కోరుతున్నారు.