Homeహైదరాబాద్latest Newsమియాపూర్ లో ఇండ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన మహిళలు..

మియాపూర్ లో ఇండ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన మహిళలు..

ఇదేనిజం,శేరిలింగంపల్లి :గత పక్షం రోజులుగా మియాపూర్ సర్వే నంబర్ 100, 101లలో వందలాది మంది మహిళలు నగరం నలుమూలల నుంచి మియాపూర్ చేరుకొని గుడిసెలు వేసుకొని ఇండ్ల స్థలాల కోసం విశ్వప్రయత్నం చేస్తున్న విషయం విదితమే. అయితే ఇటు హెచ్ఎండీఏ , అటు పోలీసులు మహిళల ప్రయత్నాల్ని అడుగడుగునా వమ్ముచేస్తూనే అన్నారు. అంతటితో ఆగకుండా కేసులు బనాయించినా మహిళలు మాత్రం అక్కడినుంచి ససేమిరా అంటుండంతో గత 15 రోజులుగా హెచ్ఎండిఏ , మియాపూర్ పోలీసులకు సవాలుగా మారింది. తాజాగా శుక్రవారం తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వందలాది మహిళలు శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న హెచ్ ఎండీఏ పరిధిలోని భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు గత కొద్దిరోజులుగా మహిళలు ప్రయత్నిస్తున్న విషయం విదితమే. అయితే హెచ్ ఎండీఏ అధికారులు మాత్రం ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో నిత్యం రసాభాసగా మారింది. మళ్ళీ గురువారం సాయంత్రం ఒకేసారి వందలాది మంది అక్కడకు చేరుకొని గుడిసెలు వేసేందుకు రావడంతో పోలీసులు వారిని పంపించివేశారు. అయితే పోలీసులు వెళ్లిన.తర్వాత రాత్రి మళ్ళీ గుడిసెలు వేష్చారు. శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకున్నపోలీసులు వాటిని తొలగించడంతో మహిళలు దీప్తిశ్రీనగర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంగీత మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న పెద్ద గద్దలను వదిలేసి, కనీస గూడు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెబుతున్నా ఈ సర్కార్ లో కూడా పేదలకు అన్యాయమే జరుగుతుందని ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఇప్పటికే పెద్ద ఎత్తున కబ్జాలు జరిగాయని, అయినా ఇన్నాళ్లు కళ్లుమూసుకున్న అధికారులు పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img