YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రక్తమోడుతోందని వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా తరహా పాలన కొనసాగుతోందని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, అరెస్టులు, దాడులు చేయిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలోని మన్నవ గ్రామంలో దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో చట్టవ్యవస్థ దిగజారుడును స్పష్టంగా చూపిస్తోందని ఆయన అన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీకి కంటగింపుగా మారిందని జగన్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను ప్రోత్సహించి ఈ దాడులు చేయించారని, ఈ ఘటన రాజకీయ కక్షసాధింపు చర్యగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. ఈ దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అనే పేరుతో రాష్ట్రంలో రాజకీయ హింస, అక్రమ కేసులు, పరిశ్రమలపై దాడులు కొనసాగుతున్నాయని, ఇలాంటి వాతావరణంలో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారని ఆయన అన్నారు.
చట్టవ్యవస్థను ఉల్లంఘిస్తూ లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత ఉందా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు, సామాన్య పౌరులకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనను ఎందుకు అమలు చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు బిహార్‌ను తలపిస్తున్నాయని, శాంతిభద్రతలు లేని వాతావరణంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.