Homeహైదరాబాద్latest Newsరోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన యువరాజ్ సింగ్

రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన యువరాజ్ సింగ్

టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ పాత్ర గురించి మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబయి ఇండియన్స్‌కు 5 సార్లు కప్ అందించిన అనుభవం, నాయకుడిగా అతని సమర్థత బాగున్నాయని కొనియాడాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ కూల్‌గా ఉంటూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల తెలివి అతని సొంతం అంటూ కొనియాడాడు.

బ్యాటింగ్ విషయానికి వస్తే భారీ షాట్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తూ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేస్తాడని అన్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు రోహిత్‌ శర్మ జట్టులో ఉండటం ఎంతో కీలకమని, అతను తెలివైన కెప్టెన్‌ అని ప్రశంసించాడు. జూన్‌ 2 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్‌‌లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

‘‘రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండటం ఎంతో కీలకం. ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకునే తెలివైన కెప్టెన్ మనకు కావాలి. రోహిత్ శర్మకు ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉంది. అతడు కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించాడు.

రోహిత్ సారథ్యంలో టీమ్ఇండియా 2023 వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. భారత్‌కు కెప్టెన్‌గా రోహిత్‌లాంటి ఆటగాడు అవసరమని నేను భావిస్తున్నాను. ఎన్నో విజయాలు సాధించినా అతడి వ్యక్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేదు.

అదే రోహిత్ శర్మ బ్యూటీ. సహచర ఆటగాళ్లతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. మైదానంలో నాయకుడిగా ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. క్రికెట్‌లో నాకున్న అత్యంత ఆప్తమిత్రుల్లో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ శర్మను ప్రపంచ కప్ ట్రోఫీ, పతకంతో చూడాలని ఆశిస్తున్నాను. అతను నిజంగా దానికి అర్హుడు’’ అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ అన్నాడు.

రోహిత్ శర్మకు కెరీర్‌ తొలినాళ్లలో యువరాజ్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరూ మంచి మిత్రులుగా మారారు. 2007లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో యువీ, రోహిత్‌ సభ్యులుగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img