కరోనా కాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి రావొచ్చు.
ఇప్పటికే గుండెజబ్బులు ఉన్నవారిని.. కరోనా జబ్బు దుష్ప్రభావాలు ఎక్కువగా పీడిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మంచి జీవనశైలిని పాటించడం, ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పీచు, యాంటీ ఆక్సిడెంట్లు
తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
మోనో అసంతృప్త కొవ్వుతో కూడిన నూనెలు వాడితే కూరగాయల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి.
కోఎంజైమ్ క్యూ10
ఇదో యాంటీఆక్సిడెంట్. దీన్ని యుబిక్వినోన్ లేదా యుబిక్వినోల్ అనీ అంటారు. గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నిజానికి దీన్ని మన శరీరమే సహజంగా తయారుచేసుకుంటుంది.
వయసు మీద పడుతున్నకొద్దీ దీని స్థాయులు తగ్గుతుంటాయి.
కోఎంజైమ్ క్యూ10 లభించే పిస్తా, గోబీపువ్వు, నారింజపండ్లు, చేపలు తినటం మంచిది.
విటమిన్ కె
గుండెజబ్బు ముప్పు తగ్గడానికి, రక్తప్రసరణ మెరుగుపడడానికి విటమిన్ కె ఎంతగానో తోడ్పడుతుంది.
రక్తనాళాల్లో కాల్షియం వంటి ఖనిజాలు పోగుపడటాన్నీ తగ్గిస్తుంది.
వీటిని రక్తనాళాల నుంచి తిరిగి ఎముకలు, దంతాల్లోకి చేర్చటానికీ ఉపయోగపడుతుంది. అందువల్ల విటమిన్ కె లోపం తలెత్తకుండా చూసుకోవాలి.
ఏరోబిక్ వ్యాయామాలు
గుండె జబ్బుల నివారణకు నడక, ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు చాలా ముఖ్యం.
టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోవడం క్రమంగా అలవాటు చేసుకోవాలి.
ప్రాణాయామం, ధ్యానం
మానసిక ప్రశాంతతకు తోడ్పడే ఇవి రక్తంలో గ్లూకోజు స్థాయులు మెరుగుపడటానికి, రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి, వాపు ప్రక్రియ తగ్గటానికి కూడా తోడ్పడతాయి.
ఒత్తిడి తగ్గడానికి దోహదం చేసే ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో గుండెజబ్బు ముప్పు 48% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.