Omicron virus spreads faster and these are symptoms : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువే.. లక్షణాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో అంతా సర్దుకుంటుందని ప్రజలు అనుకున్నారు.
కానీ ఒమిక్రాన్ రూపంలో కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది.
సౌతాఫ్రికాతోపాటు అనేక దేశాల్లో ఇప్పటికే ఈ వేరియెంట్ బారిన పడిన రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.
దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తమైంది. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
కాగా ఒమిక్రాన్ బారిన పడిన రోగులలో ఇతర కోవిడ్ లక్షణాలే ఉంటాయి. కానీ తీవ్రమైన అలసట ఉంటుంది.
గత కోవిడ్ వేరియెంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన రోగుల్లో అలసట మరీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
ఇది కొత్త వేరియెంట్ ప్రధాన లక్షణమని అంటున్నారు. అయితే ఆక్సిజన్ లెవల్స్ మాత్రం తగ్గడం లేదని తెలిపారు.
కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడితే కండరాల నొప్పులు, గొంతు సమస్యలు, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇక కొత్త కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికీ వ్యాప్తి చెందుతోంది.
గత కోవిడ్ వేరియెంట్ల కన్నా ఈ వేరియెంట్ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల కరోనా జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నారు.
కాగా ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ రిస్క్ అవకాశాలు ఎక్కువేనని చెప్పింది.
ఈ వేరియెంట్ అనేక సార్లు మార్పులకు గురైంది కనుక వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.