Thyroid : ఇవి ట్రై చేస్తే థైరాయిడ్ సమస్య రాదు
Thyroid : మన శరీరంలో మెడ కింది భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి.. థైరాయిడ్.
మన జీవక్రియలు సక్రమంగా సాగడంలో ఈ గ్రంథి పాత్ర కీలకం.
కాబట్టి, థైరాయిడ్‌ను ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఆ ప్రయత్నంలో ఉపకరించే ఆహార పదార్థాలు ఇవి..
కొబ్బరి
థైరాయిడ్ రోగులకు కొబ్బరి ఉత్తమ ఆహారం. పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కొబ్బరినూనె.. ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.
కొబ్బరి మందకొడిగా సాగే జీవక్రియను వేగిర పరుస్తుంది.
ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎంసీఎఫ్‌ఏ), మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్స్ (ఎంటీసీ) పుష్కలం. ఇవన్నీ జీవక్రియకు సహకరిస్తాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. శరీరం విటమిన్లు, మినరల్స్‌ను గ్రహించడంలో జింక్ కీలకపాత్ర పోషిస్తుంది.
శరీరంలో థైరాయిడ్ హార్మోనును సమన్వయం చేయడంలో, సమతూకంలో ఉంచడంలో సహాయకారిగా ఉంటుంది.
ఉసిరి
నారింజ పండుతో పోలిస్తే ఎనిమిది రెట్లు, దానిమ్మతో పోలిస్తే పదిహేడు రెట్లు విటమిన్-సి లభిస్తుంది.
థైరాయిడ్ ఆరోగ్యానికి ఉసిరి గొప్ప ఉపకారి. వెంట్రుకలకు మంచి టానిక్ కూడా.
బ్రెజిల్ నట్స్
థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా పనిచేయాలంటే సెలీనియం అనే సూక్ష్మపోషకం అవసరం.
సెలీనియానికి బ్రెజిల్ నట్స్ సహజ వనరులు. రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే యాంటీ ఆక్సిడెంట్స్, థైరాయిడ్ మినరల్స్ లభిస్తాయి.
పెసర్లు
అన్నిరకాల బీన్స్ కూడా ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌కు గనులు.
వీటిలో ఫైబర్ శాతమూ ఎక్కువే. దీంతో థైరాయిడ్ అసమతుల్యత వల్ల తలెత్తే మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది.
పెసర్లు అయోడిన్‌ను కూడా అందిస్తాయి. సులువుగా అరిగిపోతాయి.