తుమ్మలతో పొంగులేటి భేటి
– మరింత వేడెక్కిన ఖమ్మం రాజకీయం
– పాలేరు టికెట్‌పై చర్చ?
ఇదేనిజం, ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ లీడర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. తుమ్మల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన పాలేరు టికెట్ ఆశిస్తున్నారు. కాగా శుక్రవారం తుమ్మల నాగేశ్వర్ రావుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారింది. ఖమ్మంలోని తుమ్మల నివాసం వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తుమ్మల పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తనను, మంత్రి అజయ్‌ను తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ప్రజలకు మంచి చేయాలనే బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. అప్పుడు తనను, ఇప్పుడు తుమ్మలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు.