సింహం వైపు సోమారం చూపు?
ఒత్తిడి చేస్తున్న అనుచరులు
గెలుపోటములను అంచనా వేసుకుంటున్న సత్యనారాయణ
త్వరలోనే కార్యాచరణ ప్రకటించే అవకాశం
రామగుండంలో శరవేగంగా మారుతున్న రాజకీయం
ఇదే నిజం,రామగుండం
పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.శుక్రవారం బిజెపి నాయకుడు కౌశిక హరి గులాబీ కండువా కప్పుకోవడానికి అడుగులు వేశారు.మంత్రి కెటిఆర్ తో భేటీ అయ్యారు.త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించారు. ఆయన కారెక్కుడు చాలా నెలలు క్రితం వేసుకున్న ప్రణాళికనే. ఎన్నికల సమయం కోసం కౌశిక హరిని గులాబీ నేతల వెయింటింగ్ చేయించారు. ఇక మాజీ శాసనసభ్యుడు,ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ దారెటు అనేది చాలా రోజులుగా అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఆయన ప్రస్తుతానికి బిజెపిలో కొనసాగుతున్నారు. అయితే ఆయన కమలం గుర్తు మీద పోటీ చేయరనే చర్చ ఈ నియోజకవర్గంలో గట్టిగా ఉన్నది. సోమారపు సత్యనారాయణకు రామగుండం నియోజకవర్గంలో పార్టీలకతీతంగా గెలుపు తీరాలకు చేరుకునేంత ఓటు బ్యాంకు ఉన్నది. ఇప్పటికే సోమారం చాపకింద నీరులా తన క్యాడర్ ని , అభిమానులను ఎన్నికల కోసం సమాయత్తం చేశారు. బీజెపీ గెలుపు అంచనాలు తారుమారు కావడం, బీజెపీ నుంచి బరిలో దిగితే చాలా వర్గాల ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కమలం పార్టీ నుంచి పోటీ చేయరాదనే పునరాలోచనలో సోమారం ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపి నుంచి కాక ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తే సోమారం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ సర్వేల్లో తేలింది. మరోవైపు సోమారం సత్యనారాయణకు మళ్లీ బీఆర్ఎస్ టికెట్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.అలాగే హస్తం గూటికి సోమారం చేరుతున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రచారారాలు..ఊహాగానాల నడుమ ఆయన కొంత సందిగ్ధంలో ఉన్నట్లుగా ఆయన అనుచరులు అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోమారం చూపు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలంటే టికెట్ గ్యారెంటీ లేదు..బీఆర్ఎస్ గూటికి చేరుదామంటే అక్కడే టికెట్ల పంచాయితీ నడుస్తోంది.ఇక కమలం నుంచి బరిలో ఉందామంటే అన్ని వర్గాల ఓట్లు పడవు.ఈ పరిస్థితుల్లో సోమారం సత్యనారాయణకు ఉన్న దారి ఒక్కటేనని తెలుస్తోంది. సింహం గుర్తు మీద పోటీ చేస్తే అన్ని వర్గాలకు దగ్గర కావచ్చని సోమారం సత్యనారాయణ మీద అనుచరులు, అభిమానులు, పలువురు ఆయన శ్రేయోభిలాషలు ఒత్తిడి చేస్తున్నట్లగా సమాచారం. దీంతో సోమారం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. మూడు పార్టీలను కాదని ఇండిపెండెంట్గా బరిలో ఉంటే ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. సింహం గుర్తు రామగుండం ప్రాంతంలో బాగా పాపులర్. తాజా ఎంఎల్ఎ కోరుకంటి చందర్ సింహం గుర్తు మీదనే పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. గడిచిన కార్పోరేషన్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహం గుర్తు మీద పలువురు అభ్యర్థులు పోటీ చేసి గెలుపొంది సత్తా చాటారు. ప్రజల నోళ్లలో నానే సింహం గుర్తు మీద పోటీ చేస్తేనే ఉపయుక్తమని గెలుపు తీరాలకు తేలిగ్గా చేరవచ్చనే ఆలోచన సోమారం అనుచరులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సొంత ఓటు బ్యాంకుకు తోడు పాపులర్ ఎన్నికల గుర్తు తోడయితే గెలుపు నల్లేరు మీద నడక కాగలదనే అంచానా వేస్తున్నట్లగా సమాచారం. ఇందుకు సోమారం సత్యనారాయణ కూడా అంగీకరించారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన సోమారం నుంచి వెలువడే అవకాశం ఉన్నది. గడిచిన ఎన్నికల్లో రామగుండం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారం కారు గుర్తు మీద బరిలో ఉండగా ప్రస్తుత సిట్టింగు శాసనసభ్యుడు కోరకంటి చందర్ సింహం గుర్తు మీద పోటీ చేశారు. ఇప్పడు పరిస్థితులు మారి కారు గుర్తు మీద కోరుకంటి, సింహం గుర్తు మీద సోమారం తలపడే అవకాశాలున్నాయి.