WHO పరిశోధన ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది శరీరంలో నీటి కొరత కారణంగా మరణిస్తున్నారు. అలాంటి సమయంలో ఓఆర్‌ఎస్ వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు, వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు, మూర్ఛ వచ్చిన సమయంలో ఓఆర్ఎస్ పౌడర్ నీటిలో కలిపి తాగుతారు. ‘ORS’ మన శరీరంలోని ఎలక్ట్రోలైట్లు, ఫ్లూయిడ్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
‘ఓఆర్ఎస్’లో సోడియం క్లోరైడ్ లేదా సాధారణ ఉప్పు, ట్రైసోడియం సిట్రేట్ మరియు పొటాషియం క్లోరైడ్ వంటి మూడు రకాల లవణాలు ఉంటాయి. డయేరియా వంటి పరిస్థితులలో పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి ORS అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిగణిస్తుంది. తీవ్రమైన అతిసారం మరియు డీహైడ్రేషన్‌కు ORS అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా పరిగణించబడుతుంది.
చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎంత ORS తీసుకోవాలో తెలుసుకోండి!
2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అతిసారం ఉన్నప్పుడు 60 నుండి 125 ml ORS ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో, ఈ మొత్తం 250 ml ఉండాలి. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులు విరేచనాల సమయంలో ప్రతిసారీ 250 ml నుండి 400 ml ORS ను తీసుకోవాలి.
WHO ఫార్ములాతో తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలి: IOP వైద్య నిపుణులు
కేవలం డబ్ల్యూహెచ్‌ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్‌ఎస్‌లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని… కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే డీహైడ్రేషన్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
బయట లభించేవన్నీ నిజమైన ‘ఓఆర్‌ఎస్‌లు’ కావు.. ప్యాకేజ్డ్ పండ్ల రసాలే!
చాలామంది మెడికల్ షాపుల నుంచి ఓఆర్‌ఎస్‌ను పోలిన వివిధ ఫ్లేవర్లతో కూడిన డ్రింకులను త్రాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇందుకు కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్‌ఎస్‌లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. బయట దొరికే వివిధ రకాల ఓఆర్‌ఎస్‌లు నిజమైనవి కావని.. అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవి త్రాగడం తీవ్ర అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.