Homeలైఫ్‌స్టైల్‌కొంద‌రికి వాహ‌న ప్ర‌యాణంలో వాంతులు ఎందుకు వస్తాయి.. #MotionSickness #Travel

కొంద‌రికి వాహ‌న ప్ర‌యాణంలో వాంతులు ఎందుకు వస్తాయి.. #MotionSickness #Travel

బస్సులో ప్రయాణించేటప్పుడు కొందరికి తల తిరుగుతుంటుంది. అలాంటి వారు కిటికీ నుంచి తల బయటపెట్టి వాంతులు చేసుకుంటుంటారు. బస్సు ప్రయాణాల్లో ఈ సీను చాలా సాధారణంగా కనిపిస్తుంది.

రైలు, కారు, ఆటో, విమానం, నౌకలలో ప్రయాణం చేసే చాలా మందికి ప్రయాణాలు సరి పడక వాంతులు చేసుకుంటారు. అసలు ప్రయాణంలో వాంతులు ఎందుకొస్తాయి? ప్రయాణంలో వచ్చే వాంతులను ఆపుకోలేమా?

ఇటీవల మధ్యప్రదేశ్ ఖంద్వా జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న 13 ఏళ్ల బాలికకు కడుపులో వికారం, వాంతి వచ్చేలా అనిపించడంతో తల్లికి విషయాన్ని చెప్పింది.

తల్లి కూతురు రెండు చెవులను మూసి తలను కిటికీ నుంచి తల బయటకు పెట్టించించి.

ఆ బాలిక వాంతి చేసుకుంటుండగా… ఎదురుగా వస్తున్న లారీ తలకు తగలడంతో ఆమె చనిపోయింది.

ఇలాంటిదే మరో సంఘటనలో… వాంతి రావడంతో కిటీకి నుంచి తలబయటపెట్టినప్పుడు అక్కడ ఉన్న కరెంట్ స్థంభం బలంగా కొట్టిన ప్రమాదంలో మరో మహిళ చనిపోయింది.

ఇలా కొన్నిసార్లు ఈ వాంతులు ప్రాణాలు మీదకు కూడా తెస్తుంటాయి.

ముగ్గురిలో ఒకరికి సిక్‌నెస్…

ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో ‘మోషన్ సిక్ నెస్’ (Motion Sickness) అంటారు.

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు.

కొందరిలో ప్రయాణం మొదలుకాగానే ప్రభావం కనిపిస్తుంది.

మరి కొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత, ఎగుడుదిగుడు రోడ్లు, ఘాట్ రోడ్డు ప్రయాణం, వాహనంలో వాసనలు వలన కూడా వాంతులు వస్తాయని ప్రముఖ వైద్యులు కూటికుప్పల సూర్యారావు బీబీసీతో చెప్పారు.

“మోషన్ సిక్‌నెస్ ప్రధానంగా 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

వీరితో పోల్చుకుంటే మగవాళ్లలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. మగవాళ్లలో కంటే పిల్లలు, ఆడవాళ్లలో సెన్సిటివ్‌ నెస్‌ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం” అన్నారు డాక్టర్‌ సూర్యారావు.

“జన్యుపరంగా కూడా ఇది వస్తుంటుంది.

ఇంకా ఆడవాళ్లలో నెలసరి సమయంలో, గర్భవతులకు, మైగ్రేన్, పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవాళ్లకు ప్రయాణంలో వాంతులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ” అని ఆయన వెల్లడించారు.

స్నానం చేయకపోతే వాంతులవుతాయా?

“బస్సుల్లో ప్రయాణంలోనే కాదు…ఎలాంటి ప్రయాణంలో ఉన్నా కూడా ఈ వాంతులయ్యే అవకాశం ఉంది.

అందుకే ఈ మోషన్ సిక్‌నెస్‌కు కార్‌ సిక్‌నెస్‌, సీ సిక్‌నెస్‌, ఎయిర్ సిక్‌నెస్‌ ఇలా రకరకాలైన పేర్లు ఉన్నాయి.

కొందరికి టూ వీలర్ మీద వెళ్లినప్పుడు కూడా వాంతులువుతాయి.” అని డాక్టర్‌ సూర్యారావు చెప్పుకొచ్చారు.

“ప్రయాణాల్లోనే తలతిరగడం, వాంతులకు కారణం చెవిలో ఉండే ‘లాబ్రింథైస్‘ (labyrinths) అనే భాగమే.

ఇది పరిశుభ్రంగా లేకపోయినా, ఇది ఉన్న పరిస్థితిలో చిన్న మార్పు కలిగినా ప్రయాణంలో వాంతులు అవుతాయి.

రోజూ స్నానం చేయకపోవడం, సబ్బుతో ముఖం కడుకున్నప్పుడు చెవుల్లో నురగను శుభ్రపరచకపోవడం, నూనె వేయడం, చీము, ఏదైనా వస్తువుతో చెవులలో పదేపదే తిప్పడం వలన కూడా లాబ్రింథైస్ వద్ద సమతాస్థితి దెబ్బతింటుంది.

ఇధి మోషన్ సిక్‌నెస్‌కు కారణమవుతుంది.” అని డాక్టర్ సూర్యారావు బీబీసీకి చెప్పారు.

విమాన ప్రయాణంలో కూడా…

చెవికి, మోషన్‌ సిక్‌నెస్‌కు ఉన్న సంబంధంపై చెవి-ముక్కు-గొంతు వైద్య నిపుణుడు (ఈఎన్‌‌టీ) డాక్టరు ప్రసాదరావు బీబీసీతో మాట్లాడారు.

“మన చెవి లోపల భాగం గదులుగా ఉండి ద్రవంతో నిండి ఉంటుంది. ఇది మూడు ప్రధాన భాగాలుగా ఉంటుంది.

కోక్లియా (cochlea), వెస్టిబ్యూల్ (Vestibule), అర్ధ వృత్తవలయాలు (semi-circular canals). కోక్లియా అనేది మన చెవిని తాకే శబ్ధాలను నాడీ సంకేతాలుగా మార్చి మెదడుకు తీసుకుని వెళ్తుంది.

కోక్లియా వద్దే లాబ్రింథైస్ (labyrinths) ఉంటుంది. ఈ రెండిటిని కలిపి కోక్లియా లాబ్రింథైస్ గా చెప్తారు.

ఈ వ్యవస్థ మన చుట్టూ జరిగే శభ్దాలను గుర్తించడంలో సహాయ పడుతుంది. ఇది చాలా సున్నితమైన వ్యవస్థ.

ఇది ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండదో…అలాగే ఉండవలసిన స్థితిలో ఉండదో అప్పుడు మెదడుకు అందవలసిన సంకేతాలు సరిగా అందించలేదు.

దాంతో ముందు తలతిరగడం తర్వాత వికారంగా అనిపించడం…చివరగా వాంతులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అని ప్రసాదరావు వెల్లడించారు.

ప్రయాణాల్లో ప్రధానంగా వివిధ వేగాలతో ప్రయాణం చేయడం, అలాగే ఒకే స్థితిలో కాకుండా పైకి, కిందకు, లేదా రోడ్లపై ఉన్న గుంతల వలనో, స్పీక్ బ్రేకర్ల కారణంగా ఎరిగిపడడం జరిగినప్పుడు మన చెవిలోని కోక్లియా లాబ్రింథైస్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దాంతో వాంతులు అవుతాయి.

అలాగే విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ టర్బులెన్స్ వలన ఇదే పరిస్థితి ఉంటుంది

చెవులు ఎందుకు మూస్తారు…?

ప్రయాణాల్లో కానీ, మాములుగా కానీ వాంతి వస్తోందని ఎవరితోనైనా చెప్పగానే ముందుగా చేతులతో చెవులు మూస్తారు. అలాగే తలపై నోటితో గాలి ఊదుతారు. దీని వలన నిజంగానే ఉపశమనం కలుగుతుందా? అసలు ప్రయాణంలో వాంతులకు శాశ్వత పరిష్కరం ఉందా అంటే, ఉందనే అంటున్నారు వైద్య నిపుణులు.

“వాంతులు సమయంలో చెవులు మూయడం వలన బయట నుంచి చెవుల్లోపలికి గాలి వెళ్లనీయకుండా చేసి…చెవిలోపలి వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరగకుండా చూడవచ్చు.

సాధారణంగా ప్రయాణాల్లో వాంతులు వస్తాయనే అనుమానం ఉన్నవాళ్లు నిమ్మకాయ పట్టుకుని వెళ్తారు. నిమ్మకాయలో ఎసిడిక్ యాసిడ్స్ ఉండటం వలన ఇది కూడా ఉపశమనం కలిగిస్తుంది.

కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ ఉండే అల్లం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.” అని డాక్టర్‌ ప్రసాదరావు తెలిపారు.

తాత్కాలిక, శాశ్వత పరిష్కరాలు

వాంతులైతే ప్రయాణంలో సరదా కంటే ఇబ్బందే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కరాలు ఉన్నా…ప్రజలు పెద్దగా పట్టించుకోరని డాక్టర్ సూర్యారావు చెప్పారు.

“ఇది ప్రాణాలు తీసేసే వ్యాధి కాదు. అలాగే వాంతి కావడం చాలా సాధారణమని అనుకుంటారు.

కానీ అదొక అనారోగ్యమేనని గుర్తించరు. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. అవి శాస్త్రపరంగా రుజువు కాకపోయినా పూర్వీకుల నుంచి ఇవి పాటిస్తున్నవే. ఫలితాలు ఇస్తున్నవే.” అన్నారాయన.

“ప్రయాణంలో ఉండగా వాంతులవుతున్నట్లు అనిపిస్తే…కుడి/ఎడమ చేతి బొటన వేలు కింద చివర భాగం, మణికట్లు కలిసే చోట ఎడమ/కుడి చేతితో నొక్కిపట్టుకోవడం లేదా మెల్లగా నొక్కడం వల్ల ఉపశమనం ఉంటుంది.

ఇక శాశ్వతంగా ఈ సమస్య పరిష్కరానికి మందులున్నాయి. వాటిని కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వినియోగిస్తే తగ్గిపోతుంది.” అని సూర్యారావు చెప్పారు.

ఇది మానసిక సమస్య కూడా….

ప్రయాణం చేస్తే వాంతులవుతాయి అనేది ఒక రకమైన మానసిక వ్యాధి అంటున్నారు నిపుణులు. చాలా మంది మాకు వాంతులైపోతాయి అని మానసికంగా ముందుగానే ఒక నిర్ణయంతో ఉండటంతో మెదడు దాన్నే తీసుకుంటుంది.

ఇది కూడా ప్రయాణంలో వాంతులయ్యేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అని ఏయూ సైకాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ మధు బీబీసీతో చెప్పారు.

“ప్రయాణంలో ఉన్నప్పుడు మాకు వాంతులవుతాయని అనుకోకూడదు. ప్రయాణంలో ఎన్నో ప్రకృతి అందాలు, కొత్త రకం మనుషులు, వారి ముఖాలు, వారి ప్రవర్తన చూస్తూ పరిసరాలను ఆస్వాదించడం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు.

అలాగే ప్రయాణాంలో తలని అటుఇటు తిప్పకుండా ఏదో ఒక పాయింట్ పై దృష్టి కేంద్రీకరిస్తూ చూడాలి.” అని ప్రొఫెసర్‌ మధు అన్నారు.

మోషన్ సిక్‌నెస్‌ ఉన్నవాళ్లు వాహనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో కూర్చోకూడదు.

అలాగే ప్రయాణంలో చదవకూడదు. అన్నింటి కంటే ముందు ప్రయాణం సందర్భంగా వాంతులు అనే అంశాన్ని మన మెదడులోకి రాకుండా చూసుకోవడం కూడా మంచిదంటున్నారు నిపుణులు.

Recent

- Advertisment -spot_img