పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు.
కొవిడ్ మార్గదర్శకాల మేరకు సాధారణ భక్తుల కోసం సోమవారం ఆలయం తెరుస్తున్నట్లు శ్రీ జగన్నాథ్ దేవాలయ పరిపాలన (SJTA) తెలిపింది.
అయితే, ప్రస్తుతం స్థానిక భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తుండగా.. ఈ నెల 23 నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను అనుమతించనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆంక్షల మధ్య ఆలయాన్ని మూడు నెలలకుపైగా మూసివేశారు.
ఇటీవల ప్రభుత్వం ఆలయంలో తిరిగి భక్తుల ప్రవేశానికి అనుమతి ఇచ్చింది.
దీంతో మొదటి దశలో ఈ నెల 12న ఆలయం తెరువగా.. స్వామివారి సేవకుల కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం ఇచ్చారు.
సోమవారం నుంచి ఈ నెల 20 వరకు పూరీ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు దర్శనం కల్పించనున్నారు.
ఆలయం తెరిచిన అన్ని రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని దేవస్థానం పరిపాలన తెలిపింది.
భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పరిపాలన సూచించింది.