ఆన్లైన్ క్లాసులు, లాక్డౌన్, గేమింగ్ అడిక్షన్ నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా పిల్లలు డిజిటల్ స్క్రీన్‌ను చూసే సమయం విపరీతంగా పెరిగిపోయింది.
ఆన్లైన్ క్లాసుల పేరుతో ఐదారు గంటలు, గేమింగ్, ఇతర కార్యకలాపాల కోసం సగటున మరో రెండు గంటలు.. మొత్తంగా కనీసం ఎనిమిది గంటలపాటు డిజిటల్ స్క్రీన్కు అతుక్కుపోతున్నారు.
ఇలా కొన్ని నెలలుగా సాగుతుండటంతో దేశంలోని స్కూల్ పిల్లల్లో మయోపియా (దగ్గరి చూపు లోపం), కమిటెంట్ ఈసోట్రిఫియా (మెల్లకన్ను) వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ సంస్థ ఏటా ఆగస్టులో పిల్లల కంటి ఆరోగ్యం, భద్రతా అవగాహన మాసం నిర్వహిస్తున్నది.
ఈ సందర్భంగా ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా తమ శాఖలతోపాటు ఇతర విభాగాల నుంచి సేకరించిన గణాంకాలను తాజాగా విడుదలచేసింది.
గణాంకాల్లో తెలిసింది ఏంటంటే..
- 5నుంచి 15 ఏండ్ల వయసువారు స్రీన్ చూసే సమయం పెరుగుతుండటం వల్ల మయోపియా కేసులు (దగ్గర చూపు) 100% పెరిగాయి. 2020లో లాక్డౌన్ విధించిన నాటి నుంచి ఈ కేసుల్లో పెరుగుదల కనిపించింది.
- మన దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగానూ ఇదే పోకడ కనిపిస్తున్నది. ఈ పెరుగుదలను ‘క్వారంటైన్ మయోపియా’ అని పిలుస్తున్నారు.
- మయోపియా తీవ్రమైతే క్యాటరాక్ట్ రావొచ్చు. దీంతోపాటు ఒపెన్ యాంగిల్ గ్లకోమా, రెటినల్ డిటాచ్మెంట్, అట్రోఫిక్ మయోపిక్ మ్యాకులోపతి, మయోపిక్ స్ట్రాబిస్మస్ ఫిక్సస్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.
- గత రెండేండ్లలో కమిటెంట్ ఈసోట్రిఫియా (మెల్లకన్ను) కేసుల వృద్ధిలో ఐదు రెట్లు పెరుగుదల కనిపించింది. పిల్లలకు హఠాత్తుగా మెల్లకన్ను రావడాన్ని ఈసోట్రిఫియా అని పిలుస్తుంటారు.
- మెల్లకన్ను సమస్య గతేడాది నుంచి అత్యంత ఆందోళనకరంగా పెరుగుతున్నదని నివేదిక వెల్లడించింది.
- సాధారణంగా చదివినప్పుడు, రాసినప్పుడు మన కంటికి, ఫోకస్ చేసే వస్తువుకు (పుస్తకాలు, పెన్నులు వంటివి) మధ్య దూరం కనీసం 33 సెంటీమీటర్లు (13 ఇంచులు) ఉంటుంది.
- కంప్యూటర్ వంటి డిజిటల్ స్క్రీన్ కనీసం 51-70 సెంటీమీటర్లు(21-28 ఇంచులు) ఉండాలని అధ్యయనాలు చెప్తున్నాయి.
- పిల్లలు చాలా దగ్గరి నుంచి డిజిటల్ స్క్రీన్‌ను చూస్తున్నారు.
- ఇలా ఎక్కువ సమయం గడపడం వల్ల దగ్గరి చూపు సమస్య ఉత్పన్నం కావడంతోపాటు మెల్లకన్నుకు దారితీస్తుందని వరల్డ్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ ఆప్తామాలజీ అండ్ స్ట్రాబిస్మస్ (డబ్ల్యూఎస్పీవోఎస్) చెప్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరి
- పుస్తకాలు, పేపర్లు వంటివాటితోపాటు కాంతిని వెదజల్లే డిజిటల్ పరికరాలను దగ్గరగా చూడటం వల్ల కండ్లు పొడిబారటం, ఫొటో సెన్సిటివిటీ వంటి సమస్యలు ఏర్పడుతాయి.
- ఇవి తీవ్రమై మయోపియా, మెల్లకన్నుకు దారి తీస్తాయి.
- లాక్‌డౌన్‌తో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైళ్ల వాడకం తప్పనిసరి అయ్యిందని, కాబట్టి కచ్చితంగా 20- 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవా లి.
- మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ 3 గంటలు కంప్యూటర్ లేదా మొబైల్ ముందు గడిపే పిల్లలతో పోల్చితే కదలకుండా గంట సేపు గడిపినవారిలో కంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.
- ఆన్లైన్ క్లాసులకు మొబైల్ బదులు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ వాడేలా చూడాలి.
- ప్రతిరోజూ 1- 2 గంటలపాటు సూర్యరశ్మి అందేలా ఆరుబయట ఆడుకోనివ్వాలి.
తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
కరోనాకు ముందు మా దవాఖానల్లో పిల్లల్లో ఈసోట్రిఫియా కేసులు రోజుకు ఒకటి రెండు మాత్రమే కనిపించేవి.
ఇప్పుడు 10 కేసులకుపైగా కనిపిస్తున్నాయి. మయోపియా బాధితుల సంఖ్య కూడా రెట్టింపయ్యింది.
మయోపియాను అరికట్టేందుకు చికిత్స ఉన్నది.
కానీ కమిటెంట్ ఈసోట్రోఫియాను సరిదిద్దడం దాదాపు సాధ్యం కాదు.
కాబట్టి తల్లిదండ్రులు కంటికి, డిజిటల్ స్క్రీన్కు మధ్య దూరంపై శ్రద్ధ చూపాలి.