Homeఫ్లాష్ ఫ్లాష్Migraine Treatment : మైగ్రేన్‌ తలనొప్పికి కారణాలు.. చికిత్స..

Migraine Treatment : మైగ్రేన్‌ తలనొప్పికి కారణాలు.. చికిత్స..

Migraine : మైగ్రేన్‌ సాధారణంగా ఏకపక్షంగా మొదలై మధ్యస్థం నుంచి తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. రోజూవారీ కార్యకలాపాలతో ఈ తలనొప్పి తీవ్రత పెరుగుతుంటుంది.

మైగ్రేన్‌ తలనొప్పి సాధారణంగా కొన్ని గంటలు మొదలుకొని 1-2 రోజుల వరకు ఉంటుంది.

తలనొప్పితోపాటు వికారం, వాంతులు, తలతిరగడం, వెలుతురు చూసినా, పెద్ద శబ్దాలు విన్నా చిరాకు రావడం తరచుగా చూస్తుంటాం.

పేషెంట్‌ ఒక నిశ్శబ్దమైన చీకటి గదిలో కూర్చోవడానికి ఇష్టపడతారు.

కొంతమంది పేషెంట్స్‌కు తలనొప్పి మొదలయ్యే ముందు కంటిముందు జిగ్‌జాగ్‌ లైన్స్‌ కనిపించడం, చెవుల్లో గుయ్యిమనే శబ్దం రావడం జరుగుతుంటుంది.

వీటిని ఆరా (AURA) అని అంటాం. చాలామంది పేషెంట్స్‌లో తలనొప్పి ప్రారంభానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలుంటాయి.

ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం, సమయానికి భోజనం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, దూర ప్రాంతాలు ప్రయాణించడం వంటి సందర్భాలు సాధారణంగా మైగ్రేన్‌ తలనొప్పికి దారితీస్తుంటాయి.

కొద్దిమందిలో మద్యం సేవించడం, హార్మోన్‌ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు, వాతావరణంలో మార్పులు, కొన్ని రకాలైన బలమైన వాసనలు, ప్రకాశవంతమైన వెలుతురు చూడడం, కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం వంటివి మైగ్రేన్‌ తలనొప్పికి దారితీస్తాయి.

తలనొప్పి మొదలయ్యే ముందు అలసటగా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం, మెడనొప్పి, ఎక్కువగా ఆవలించడం, వికారం, మానసిక కల్లోలం లాంటివి సాధారణంగా చూస్తుంటాం.

తరచుగా మైగ్రేన్‌ తలపొప్పి రావడంతో కొంతమంది సరిగ్గా పనికి హాజరు కాలేకపోవడం, చేసే పనిలో ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంటుంది.

తద్వారా చదువులో మరియు పనిలో సరైన ఫలితాలు రాబట్టకపోవడం జరుగుతుంది.
తరచుగా తలనొప్పి వచ్చేవాళ్ళలో నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. తద్వారా జీవిత నాణ్యత తగ్గిపోతుంటుంది.

కొంతమందిలో తలనొప్పి క్రానిక్‌ మైగ్రేన్‌గా ఆవిర్భవిస్తుంది. వీరిలో నెలలో పదిహేను రోజుల కంటే ఎక్కువగా తలనొప్పితో బాధపడతారు.

ఈ క్రానిక్‌ మైగ్రేన్‌కు ప్రధాన కారణాలు తలనొప్పి మందులు మరీ ఎక్కువగా తీసుకోవడం, తలనొప్పి వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోవడం, ఊబకాయం, నిద్రలేమి సమస్యలు, ఎక్కువగా కాఫీ తీసుకోవడం, మానసిక రోగాలు వంటివి ఉన్నాయి.

చికిత్స:

  • మైగ్రేన్‌ చికిత్స రెండు విధాలుగా ఉంటుంది.
  • తలనొప్పి వచ్చినప్పుడు తీసుకోవల్సిన చర్యలు, తలనొప్పి భవిష్యత్తులో రాకుండా నివారించే చర్యలు.
  • తలనొప్పి వచ్చినప్పుడు నిశ్శబ్దమైన చీకటిగదిలో విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా మంచినీళ్లు తాగడం, నొప్పి ఉన్నచోట ఐస్‌ప్యాక్‌ ఉంచడం, మెంథాల్‌ కలిగిన క్రీమ్‌లను రాసుకోవడం, లోతైన శ్వాస తీసుకోవడం లాంటివి చేయాలి. పారాసిటమాల్‌, నాప్రోక్సెన్‌, కొన్ని రకాల పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకోవచ్చు.
  • ప్రత్యేకంగా మైగ్రేన్‌ కోసమే తయారుచేసిన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ట్రిప్‌టాన్స్‌ (TRIP TANS) అంటాం. ఇవి టాబ్లెట్లు, ఇంజెక్షన్‌ మరియు ముక్కులో వేసుకొనే స్ప్రే రూపంలో అందుబాటులో ఉన్నాయి.
  • నివారణ చర్యలు
  • రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర, అవసరానికి తగినట్లుగా ద్రవ పదార్థాలు తీసుకోవడం, నియమిత కాలంలో భోజనం చేయడం, కెఫెన్‌ కలిగిన పానీయాలు తక్కువ మోతాదులో తీసుకోవడం, వ్యాయామం చేయడం, బరువు తగ్గడం వంటి చర్యలతో మైగ్రేన్‌ని నివారించవచ్చు.
  • దానితోపాటు ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాలాంటివి చేయడం సహకరిస్తాయి. అలాగే పేషెంట్స్‌ తలనొప్పి వచ్చిన సమయాన్ని మరియు దానికి దారితీసిన సందర్భాన్ని ఒక డైరీలో రాసుకోవడం వల్ల తలనొప్పికి దారితీసే ప్రత్యేక కారణాలను గుర్తించవచ్చు.
  • తద్వారా భవిష్యత్తులో నివారించవచ్చు. మైగ్రేన్‌ను నియంత్రించేందుకు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
  • దీనితోపాటు కొంతమందిలో బొటాక్స్‌ ఇంజెక్షన్‌ కూడా ఉపయోగించవచ్చు.
  • మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, కో-ఎంజైమ్‌-Q మరియు రైబోఫ్లెవిన్‌ విటమిన్స్‌ లాంటివి మైగ్రేన్‌ నివారణలో ఉపయోగపడతాయి.

వ్యాధి నిర్ధారణ
పేషెంట్‌ యొక్క తలనొప్పి లక్షణాలు, తలనొప్పికి దారితీసే ప్రత్యేక సందర్భాలు క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారించవచ్చు. సీటీ స్కాన్‌గానీ, ఎంఆర్‌ఐ సాధారణంగా అవసరం లేదు.

Recent

- Advertisment -spot_img