KHO KHO PLAYERS MURDER IN UP : 24 ఏళ్ల జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారిణిపై అత్యాచారయత్నం, హత్య కేసును 3 రోజుల్లోనే ఛేదించారు పోలీసులు.
నిందితుడిని అరెస్టు చేశారు. మరోచోట.. అడిగినంత కట్నం తేలేదని అత్తింటివారే కోడలికి విషమిచ్చి చంపారు. ఈ రెండు ఘటనలు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.
బిజ్నోర్ రైల్వే స్టేషన్లో.. జాతీయ స్థాయి ఖో-ఖో క్రీడాకారిణిపై అత్యాచారం విఫలం కాగా.. ఆమెను హత్య చేశాడో దుండగుడు.
బాధితురాలి ఫోన్‌ను ట్రేస్ చేసి.. నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు.
ఇదీ జరిగింది..
సెప్టెంబర్ 10, మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇంటికి తిరిగివెళ్తోంది 24 ఏళ్ల యువతి. ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన రైల్వే కూలీ షెహజాద్ ఖాదిమ్ అత్యాచారం చేయబోయాడు.
ఆ సమయంలో తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతున్న బాధితురాలు.. సహాయం చేయాలని గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తిని ప్రతిఘటించింది. కోపోద్రిక్తుడైన అతడు.. దుపట్టా, తాడు సహాయంతో ఆమెను హత్య చేశాడు.
చనిపోయిన మహిళ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని చూసి స్థానికులు.. ఆమె కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఫోన్ ఆధారంగా..
బాధితురాలి ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. ఈ మంగళవారం అతడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.
అతడి చొక్కా రక్తంతో ఉండటాన్ని గుర్తించారు. ఇంకా.. ఘటనా స్థలంలో నిందితుడి చెప్పులు, చొక్కా గుండీలు దొరికాయి.
ఖాదిమ్‌కు.. ఇప్పటికే పెళ్లై ఓ కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అతడు మాదక ద్రవ్యాలకు బానిస అని, స్థానిక పోలీసు స్టేషన్లో నిందితుడిపై నాలుగు దొంగతనం కేసులున్నాయని పేర్కొన్నారు.
3 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసు బృందానికి రూ. 25 వేల రివార్డు ప్రకటించారు ఎస్పీ ధరంవీర్ సింగ్.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కోరనున్నట్లు తెలిపారు.
కట్నం తేలేదని విషం ఇచ్చి..
అడిగినంత కట్నం తీసుకురాలేదని.. ఓ మహిళకు విషం ఇచ్చి హత్య చేసిన మరో ఘటన ఉత్తర్‌ప్రదేశ్ షామ్లీ జిల్లాలో జరిగింది.
అజాద్ చౌక్‌కు చెందిన ముస్కాన్‌కు.. మే నెలలో ఖాసిఫ్తో పెళ్లయింది.
అప్పటినుంచి.. తరచూ తమ కూతుర్ని కట్నం కోసం వేధించేవాడని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.
ఈ క్రమంలోనే.. హత్య చేశారని ఆరోపించారు.
బాధితురాలి భర్త, అత్త సహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం.. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.