NASA’s InSight Detects Two Sizable Quakes on Mars : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని ( Mars Quake ) గుర్తించింది.
ఇప్పటి వరకూ మార్స్‌పై మానవాళికి తెలియని అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్సైట్ గుర్తించినట్లు నాసా వెల్లడించింది.
4.2 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు.. ఏకంగా గంటన్నర పాటు సాగినట్లు తెలిపింది. ఈ నెల 18న ఈ అతిపెద్ద, సుదీర్ఘ భూకంపం నమోదైంది.
అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు మూడోసారి కనిపించడం గమనార్హం.
గత నెల 25న ఇన్సైట్ తన సీస్మోమీటర్లో 4.2, 4.1 తీవ్రత కలిగిన రెండు భూకంపాలను గుర్తించింది.
2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా ఈ నెల 18న కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల శక్తి ఐదు రెట్లు అని నాసా చెప్పింది.
అంతేకాదు ఇన్సైట్ ల్యాండర్ ఉన్న చోటు నుంచి 8500 కిలోమీటర్ల దూరంలో ఈ 4.2 తీవ్రత ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది.
అంత దూరంలో వచ్చిన ప్రకంపనలను ఇన్సైట్ గుర్తించడం ఇదే తొలిసారి.
ఇప్పుడు భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు.
సాధారణంగా రాత్రి పూట, గాలులు తక్కువగా ఉన్న సమయంలో ఇన్‌సైట్‌లోని సీస్మోమీటర్ ఈ మార్స్ కంపాలను గుర్తించేది.
అయితే ఈసారి మాత్రం పగటి సమయంలో ప్రకంపనలను ఇన్సైట్ రికార్డ్ చేసింది. 2018, మార్చిలో ఈ ఇన్సైట్ ల్యాండర్ మార్స్‌పై దిగింది.