TSSPDCL : నేడు తెలంగాణలో కరెంట్ బంద్ ? విద్యుత్ ఉద్యోగులు సంచలన నిర్ణయం
TSSPDCL : కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ బిల్లును సోమవారం పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.
విద్యుత్ సంఘాలన్నీ ఏకమై మహాధర్నాకు పిలుపునిచ్చాయి.
విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని ఇప్పటికే పలు విద్యుత్ సంఘాల నేతలు కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచే ధర్నాకు దిగాలని విద్యుత్ శాఖకు చెందిన అన్ని విభాగాల సిబ్బందికి పిలుపునిచ్చారు.
విధులు బమిష్కరించేందుకు సైతం ఉద్యోగులు సిద్దమయ్యారు.
కరెంట నిలిచిపోయినా, సరఫరాలో ఆబ్బందులు తలెత్తినా తాము హాజరయ్యేది లేదని ముక్త కంఠంగా స్పష్టం చేశారు.
దీంతో రేపు తెలంగాణలో కరెంట్ నిలిచిపోయే అవకాశముంది.
వినియోగదారులు కూడా తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు ద్వారా విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది, ఇంజినీర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారే ప్రమాదముందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సవరణ బిల్లు ద్వారా ప్రజలపై కూడా అధిక భారం పడుతుందని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు.
సంస్థను క్రమంగా ప్రైవేట్ పరం చేయనున్నారని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు..
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డిస్కంలను ప్రైవేట్ పరం చేశారు.
లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి.
అయినా కేంద్రం అవేమీ తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
ప్రైవేట్ పరమైతే సంస్థలో విద్యుత్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గించడమే కాకుండా పని ఒత్తిడి పెరిగే అవకాశముందని ఉద్యోగులు, ఇంజినీర్లు తమ అభిప్రాయాన్ని వెళ్లగక్కుతున్నారు.
ప్రైవేట్ సంస్థలు తమకు నచ్చినట్లుగా కరెంట్ చార్జీలు పెంచుతాయని చెబుతున్నారు.
రైతులు, సామాన్యులపై తీవ్ర భారం మోపాలని కేంద్రం చూస్తోందని విమర్శలు చేస్తున్నారు.
విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా ఎఫెక్ట్ వినియోగదారులు, వ్యాపార రంగంపై తీవ్రంగా పడే అవకాశముంది.
కరెంట్ సరఫరాలో అంతరాయమొస్తే పునరుద్ధరణ కష్టంగా మారనుంది.
ధర్నాలో పాల్గొననుండటంతో సిబ్బంది ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
దీంతో బిజినెస్ పై ప్రభావం పడే అవకాశముంది.
బిల్లు పెడితే నిరవధిక సమ్మె- టీఎస్ పీఈ జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకేనని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కళ్యాకర్ రావు ఆరోపించారు.
ఈ బిల్లును ప్రవేశపెడితే నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సోమాజిగూడలో విద్యుత్ సవరణ బిల్లుపై నిరసనగా మహాధర్నాకు పిలుపునిచ్చారు.
ధర్నా వాల్ పోస్టర్లకు ఆయన ఆవిష్కరించారు.
కేంద్రం ఆగస్టు 8వ తేదీన పార్లమెంట్ లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తోందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ చట్టం వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలపాలని విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి సూచించారు.
వినియోగదారులు సహకరించాలని కోరారు.
ప్రైవేట్ సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా అదే విద్యుత్ లైన్ నుంచి సరఫరా చేసేలా ఈ బిల్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిస్కంలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకు కేంద్ర ఈ బిల్లులను తీసుకొస్తోందని మండిపడ్డారు.
ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 12 రాష్ట్రాల ప్రభుత్వాలు తీర్మానం చేశాయని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ తీర్మానం పంపిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఒకవేళ బిల్లు పెడితే టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బిల్లు అమలు చేస్తే బీజేపీ నాయకులను, ఎంపీలు, కేంద్ర మంత్రులను నిలదీయాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ఈ బిల్లు పెడితే బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇండ్లకు విద్యుత్ సరఫరా కబ్ చేస్తామని హెచ్చరించారు.
వీరితో పాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఎస్ సైతం సమ్మెకు సిద్ధమవుతోంది.