virginity test:
పంచభూతాల సాక్షిగా.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఆ జంట ఒక్కటయ్యారు. ఇక తన భర్తతో సంసార జీవితం గురించి వధువు ఎన్నో కలలు కన్నది. ఊహాల్లో విహరించింది. ఇక ఆ సమయం కూడా రానే వచ్చింది. తొలిరాత్రికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఆ తెగ సంప్రదాయం ప్రకారం.. తొలిరాత్రి రోజు నూతన వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు. ఆమె ఆ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తాను కన్న కల నెరవేరలేదు. కన్యత్వ పరీక్షలో ఫెయిలైనందుకు ఆమెకు వరుడి కుటుంబ సభ్యులు, పంచాయతీ పెద్దలు రూ. 10 లక్షలు జరిమానా విధించారు.
రాజస్థాన్లోని భిల్వారాకు చెందిన 24 ఏండ్ల యువతికి ఈ ఏడాది మే 11న వివాహమైంది. పెళ్లి అయిన రెండుమూడు రోజులకు నూతన దంపతులకు తొలిరాత్రి ఏర్పాటు చేశారు. ఆ తెగ సంప్రదాయం ప్రకారం.. అదే రోజు ఆమెకు కన్యత్వ పరీక్ష నిర్వహించగా, ఆమె ఫెయిలైంది. పెళ్లి కంటే ముందు తనపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని, దీనికి సంబంధించి కేసు కూడా నమోదైందని తెలిపింది. ఆ మాటలేవి వరుడి కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. నూతన వధువును మానసికంగా హింసించి, వేధింపులకు గురి చేశారు. మళ్లీ మే 18వ తేదీన స్థానిక దేవాలయంలో పంచాయతీ పెట్టారు. వధువుకు రూ. 10 లక్షల జరిమానా విధించారు. తనపై పెళ్లి కంటే ముందు లైంగికదాడి జరిగిందని చెప్పినా వినిపించుకోకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.