ATM THEFT: దొంగలు తెలివి మీరి రెచ్చిపోతున్నారు. దానిని పగలగొట్టి డబ్బు దోచుకెళ్లడం ఇబ్బంది అనుకున్నారో ఎమో కానీ ఏకంగా ఏటీఎం మిషన్లనే కొల్లగెట్టేస్తున్నారు. స్థానికులంతా గాఢ నిద్రలో ఉండగా ఏటీఎం మెషీన్‌ను ట్రక్కులో ఎక్కించి ఎత్తుకెళ్లిపోయారు. పైగా ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలోనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందని తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు. విస్తుగొలిపే ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటీఎం చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్ని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సవాలుగా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఏటీఎం మెషీన్ చోరీ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం మెషీన్‌లోకి చొరబడిన నలుగురు దుండగులు ఏటీఎం మెషీన్‌లోంచి డబ్బులు తీసేందుకు విఫల యత్నం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. ఏటీఎం మెషీన్‌లోకి చొరబడిన దుండగులు రెయిన్‌కోట్లు ధరించి ఉన్నారు. ముఖాలు కూడా కనిపించకుండా మాస్క్‌లు వేసుకుని జాగ్రత్తపడ్డారు. జులై9 ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల ప్రాంతంలో ఏటీఎం మెషీన్‌లోకి ప్రవేశించిన దొంగలు..తొలుత ఏటీఎం మెషీన్ తెరిచేందుకు ప్రయత్నం చేశారు. కానీ, ఏటీఎం మెషీన్ ఎంతకూ తెరుచుకోవడంతో ఇక లాభం లేదని భావించి ఏకంగా ఏటీఎం మెషీన్నే ఎత్తుకెళ్లారు. వెంట తెచ్చుకున్న ట్రక్కులో ఏటీఎం మెషీన్ ఎక్కించి అక్కడ్నుంచి పరారయ్యారు.
మర్నాడు ఉదయం ఏటీఎం సెంటర్‌లో మెషీన్ లేకపోవటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలోని సీసీటీవీల ఫుటేజ్‌ని సేకరించారు. సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో సుమారు రూ.10 లక్షలు ఉన్నాయని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.