Homeతెలంగాణtelangana youth:గేమ్ చేంజ్

telangana youth:గేమ్ చేంజ్

గేమ్ చేంజ్

  • తెలంగాణలో మారిన రాజకీయ చిత్రం
  • గతంలో బీజేపీకి యువత మద్దతు
  • ఇప్పుడు వారంతా దూరం
  • కాంగ్రెస్ వైపు యూత్ చూపు..
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం హస్తం ఖాతాలోకే..
  • రాష్ట్రంలో కాషాయపార్టీ సెల్ఫ్ గోల్..

telangana youth:ఇదేనిజం, స్టేట్ బ్యూరో: ఇంతకాలం బీజేపీకి సపోర్ట్ చేసిన తెలంగాణ యువత ఒక్కసారిగా మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం యూత్ మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపు చూస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేసిన యువత ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వాన్ని అస్సలు నమ్మడం లేదు.

జాతీయ స్థాయిలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని యువత బలంగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు యువత మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నది.

కేసీఆర్ పై యూత్ లో వ్యతిరేకత..
తెలంగాణ సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్ర యువత విసిగిపోయింది. ఉద్యోగ కల్పన చేయకపోవడం, నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో వారంతా బీఆర్ఎస్ పై కోపంగా ఉన్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత పాత్ర మరవలేనిది. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని వారంతా భావించారు. బీఆర్ఎస్ 2014, 18 లో వరసగా గెలుపొందినప్పటికీ యువతను పట్టించుకోలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేదు.

యూనివర్సిటీలను సైతం నీరు గార్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే ఆయనకు ఘోరమైన అవమానం జరిగింది. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఆయన ఓయూకు వెళితే.. విద్యార్థులు నిరసన గళం వినిపించారు. దీంతో కేసీఆర్ ప్రసంగించకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత కేసీఆర్ ఎప్పుడూ యూనివర్సిటీల మొహం పెద్దగా చూడలేదు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కూడా లేకపోవడంతో యువత బీఆర్ఎస్ సర్కారుపై కోపం పెంచుకున్నది. కానీ యూత్ తరఫున పోరాడేందుకు రాష్ట్రంలో ఏ రాజకీయపార్టీ పెద్దగా చొరవ తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ విధానాలతో రాష్ట్రంలో యువత ఆ పార్టీకి పెద్దగా ఆకర్షితులు కాలేదు.

బండి నాయకత్వంతో బీజేపీలో మారిన సీన్..
బీజేపీ స్టేట్ చీఫ్ గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక యువతను ఆకర్షించారు. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారు. గతంలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారంతా.. పెద్దగా యువతకు ఆకర్షించలేకపోయారు. కానీ సంజయ్ మాత్రం.. తన దూకుడుతో వారిని ఆకర్షించారు. నిత్యం సీఎం కేసీఆర్ పై ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించేవారు. దీంతో ఉద్యోగాలు రాక విసిగిపోయిన యువత బీజేపీ వైపు మళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీజేపీ విస్తరించింది. బండి సంజయ్ కూడా యువత టార్గెట్ గా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ మార్చ్ ల పేరిట అనేక నగరాలు, పట్టణాల్లో పర్యటించారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని యువత మొత్తం బీజేపీ వైపు ఉన్నట్టు కనిపించింది.

బీజేపీ పెద్దల నిర్ణయంతో రగిలిపోతున్న యువత..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం కర్ణాటక ఎన్నికల ముందు వరకు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావించారు. యువత కూడా బీజేపీనే ఆదరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా పరిస్థితి మారిపోయింది. మరోవైపు బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ పెద్దలు ఉన్నపలంగా బండి సంజయ్ ని తప్పించి.. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. కిషన్ రెడ్డికి నెమ్మదస్తుడు అనే పేరుంది. అంతేకాక కేసీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నదని ప్రచారం బలంగా జనంలోకి వెళ్లింది. దీంతో యువత ప్రస్తుతం బీజేపీపై నమ్మకం కోల్పోయారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.

బిడ్డ కోసం కేసీఆర్.. కాంగ్రెస్ రావొద్దని బీజేపీ ?
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సన్నివేశం ఒక్కసారిగా మారింది. సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం సైలెంట్ గా మారిపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్నాయని.. అందులో భాగంగానే కవిత అరెస్ట్ కావడం లేదని సమాచారం.. మరోవైపు ఈ ఒప్పందంలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరిగిందన్న ప్రచారమూ సాగుతోంది..

తెలంగాణలో బీజేపీ సమాధి
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నది. బండి నాయకత్వంలో రాష్ట్రమంతా విస్తరించింది. కానీ అధిష్ఠానం కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేయడంతో తెలంగాణ లో బీజేపీ పూర్తిగా సమాధి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కిషన్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.. అయినప్పటికీ బీజేపీ పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదు. ఇప్పుడు కూడా బీజేపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యువత ఓట్లను ప్రభావితం చేయగలరు. భావజాల వ్యాప్తిలోనూ వారి పాత్ర కీలకం.. యువత ఓట్లు వేయడమే కాకుండా.. వారి కుటుంబసభ్యులతోనూ ఓట్లు వేయించగలరు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ పైపు గుంపగుత్తగా పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

బీజేపీ పెద్దల లక్ష్యం నెరవేరుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు.. అన్నది బీజేపీ పెద్దల యోచన. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి పడితే.. అది కూడా బీజేపీకి తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిచి.. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలిస్తే.. బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. మరి బీజేపీ పెద్దల లెక్కలు ఏమిటి? కాంగ్రెస్ గెలవొద్దన్న ఉద్దేశ్యంతో తమ పార్టీని ఎందుకు ఫణంగా పెట్టారు.. అన్నది భవిష్యత్ లో తేలనున్నది.

Recent

- Advertisment -spot_img