– అక్కడక్కడా గొంతెత్తుతున్న అసంతృప్తులు
– అధినేత మీద మాత్రం నో కామెంట్స్
– కార్పొరేషన్, ఎమ్మెల్సీ పదవుల కోసమే అలకలు
– అధిష్ఠానం బుజ్జగించకపోతుందా.. అని వెయిటింగ్
– ఉప్పల్‌లో బొంతు, స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య, పాలేరులో తుమ్మల అసంతృప్తి
– రంగంలోకి హైకమాండ్.. కొనసాగుతున్న బుజ్జగింపులు
ఇదేనిజం, స్పెషల్ బ్యూరో: బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చికా భారీగా అసమ్మతి ఉంటుందని అంతా భావించారు. ఇతర పార్టీల్లోకి భారీగా చేరికలు ఉంటాయని ఊహించారు. కానీ అనూహ్యంగా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి.. బీఆర్ఎస్ అధినేత అసమ్మతి విషయంలో సక్సెస్ సాధించారు. ఇక అక్కడక్కడా నేతలు గొంతెత్తుతున్నప్పటికీ లోకల్ లీడర్స్ మీద కోపం తప్ప.. పార్టీ అధిష్ఠానం మీద పెద్దగా విమర్శలు గుప్పించడం లేదు. తాము అసమ్మతి వ్యక్తం చేస్తే కార్పొరేషన్ పదవో.. ఎమ్మెల్సీ పదవో వస్తుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎక్కడా టికెట్ల పంచాయితీ లేకుండా అంతా సజావుగా ఉండటంతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తొలుతు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మైనంపల్లి హనుమంతరావు సైతం ప్రస్తుతం చల్లబడ్డట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి పెద్ద స్థాయిలో ఇతర పార్టీల్లో చేరికలు ఉంటాయని భావించినా ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. రేఖానాయక్, వేముల వీరేశం మినహా నేతలెవరూ ప్రస్తుతం పక్కచూపులు చూడటం లేదు. ఒకటి రెండు చోట్ల మాత్రమే టికెట్స్ పొందిన అభ్యర్థుల విజయవకాశాలను ప్రభావితం చేసే స్థాయి నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. మిగిలిన చోట్ల షరామాములే.
మైనంపల్లి చల్లబడ్డట్టేనా?
బీఆర్ఎస్ టికెట్ రాకముందే మైనంపల్లి హనుమంతరావు ఆ ఆపార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక మైనంపల్లికి సొంత పార్టీ నేతలు, అనుచరుల నుంచి మద్దతు దక్కలేదు. తిరుపతిలో నోటికొచ్చినట్టు మాట్లాడిన మైనంపల్లి.. ఆ తర్వాత చల్లబడ్డారు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు టికెట్ దక్కదని తెలిసి నోరుజారారు. ఇక ఇటీవల మెదక్ బహిరంగసభలో సైతం కేసీఆర్ మాట్లాడుతూ.. మెదక్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి తన కూతురి లాంటిందని .. ఆమెను గెలిపించాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ అధిష్ఠానం సైతం మైనంపల్లి విషయంలో ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి మీద కేసీఆర్ గుర్రుగా విన్నట్టు తెలిస్తుంది. సస్పెన్షన్ తప్పదనే బీఆర్ఎస్ వర్గాల భోగట్టా.
ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తనకు టికెట్ దక్కకపోవడంతో అలకబూనారు. ఆయన బహిరంగంగా బీఆర్ఎస్ అధినేత మీద ఒక్కమాట కూడా మాట్లాడలేదు గానీ.. ఆయన అనుచరులు కొంత హడావుడి చేశారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. తుమ్మల వ్యవహారం దాదాపు సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారకుండా.. ఎమ్మెల్సీ పదవో.. కార్పొరేషన్ పదవో వస్తుందని తుమ్మల ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బొంతు రామ్మోహన్ సైతం కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే బొంతు కూడా ఒకటి రెండ్రోజుల్లో చల్లబడేటట్టే కనిపిస్తోంది.
మదన్ రెడ్డి కోసం కార్యకర్తల మీటింగ్..
మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మదన్ రెడ్డి కి టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో మదన్ రెడ్డి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఇక కోదాడలో బొల్లం మల్లంయాదవ్ కు వ్యతిరేకంగా కోరుకంటి చందర్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు లీడర్లు కూడా నేరుగా అధిష్ఠానంపై విమర్శలు చేయడం లేదు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం కావడం లేదు.