– స్టూడెంట్లపై దాడిని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన విద్యార్థి సంఘాలు
– కాకతీయ వర్సిటీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
– స్టూడెంట్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం
– బంద్‌కు మద్దతు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్
Warangal Bandh..ఇదేనిజం, వరంగల్: స్టూడెంట్లపై దాడిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ బంద్ నేపథ్యంలో మంగళవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించి స్టూడెంట్లు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతకుముందు వర్సిటీ వద్ద పలు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. బస్సు నుంచి స్టూడెంట్లను దింపేసి బంద్‌కు సహకరించాలని కోరాయి. స్టూడెంట్ జేఏసీ బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. పీహెచ్‌డీ కేటగిరీ-–2 ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతుంటే.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ ఆరు రోజులుగా కాకతీయ వర్సిటీ స్టూడెంట్లు దీక్షలు చేస్తున్నారు. కేటగిరీ-–2లో అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి.. మెరిట్ ప్రకారం రెండో జాబితా ప్రకటించి, అడ్మిషన్లు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవడంతో పాటు.. రిజిస్ట్రార్‌ను వెంటనే తొలగించాలని మండిపడుతున్నారు.
వివాదాల వర్సిటీ..
కాకతీయ యూనివర్సిటీని వివాదాలు చుట్టుముట్టాయి. దాన్నుంచి బయటపడేందుకు స్టూడెంట్లకు దారి చూపాల్సిన పాలకవర్గం చేతులెత్తేసింది. విద్యార్థి సంఘాల ఆందోళనలు, బంద్ నేపథ్యంలో మరోదారి లేక యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. దీంతో స్టూడెంట్లు అయోమయంలో చిక్కుకున్నారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో స్టూడెంట్ జేఏసీ నాయకులు యూనివర్సిటీని అట్టుడికి పోయేలా చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఉమ్మడి జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులను అందించిన ఘనత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానిది. ఎన్నో ఉద్యమాలు ఈ వర్సిటీలోనే పురుడు పోసుకున్నాయి. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయువుపట్టుగా నిలిచిన కాకతీయ వర్సిటీ ఇప్పుడు ఆందోళనలకు కేంద్రంగా మారింది.