– ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకున్న యువతి
– వైరల్‌గా మారిన వీడియో
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్ దళాల చేతుల్లో బందీగా ఉన్న ఓ యువతి తనను విడిపించాలంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఓ వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియోలో యువతి చేతికి తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పిన ఆ యువతి.. వీలైంనంత త్వరగా తనను ఇక్కడి నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తున్నది. అందులో 21 ఏళ్ల ఫ్రాన్స్-ఇజ్రాయెల్ మహిళ మియా షెమ్ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడింది. ‘నా పేరు మియా. మాది గాజా సరిహద్దులోని షోహమ్ అనే ప్రాంతం. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నాను. అక్టోబరు 7న నేను రీమ్ కిబుట్జ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్ పార్టీకి వెళ్లా. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలో నాకు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. వీలైనంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి విడిపించండి. మా అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లండి’ అని మియా ఆ వీడియోలో అభ్యర్థించింది. అయితే, ఆమె ఎలా గాయపడిందో మాత్రం మియా ఆ వీడియోలో వివరించలేదు.
ఈ వీడియోను హమాస్ మిలిటెంట్లు తమ సొంత టెలిగ్రామ్‌లో విడుదల చేయగా.. ఆ తర్వాత ఆ సంస్థ మద్దతుదారులు కొందరు ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మియా కిడ్నాప్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ధ్రువీకరించింది. మియా కుటుంబాన్ని సంప్రదించి.. ఆమె హమాస్ చెరలో ఉన్నట్లు చెప్పామని తెలిపింది. ‘తమను తాము మానవత్వం ఉన్న మనుషులుగా చిత్రీకరించుకునేందుకే హమాస్ ఈ వీడియోను విడుదల చేసింది. కానీ, అది ఓ భయంకరమైన ఉగ్రవాద సంస్థ. అనేక మంది పసిబిడ్డలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులను అపహరించారు. పలువురిని హత్య చేశారు. మియాతో పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించేందుకు మేం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం’ అని ఐడీఎఫ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. కాగా.. ఇటీవల బందీల పిల్లలను ఆడిస్తున్న వీడియోను కూడా హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు పాల్పడిన మారణహోమంతో వారిపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. ఈ వీడియోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇదిలా ఉండగా.. హమాస్ చెరలో దాదాపు 200 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. హమాస్ నెట్‌వర్క్‌ను ఛేదించి.. బందీలను విడిపించేందుకు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైంది.