– నన్ను కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు
– కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
– మునుగోడు ఉప ఎన్నిక సీఎంకు 3 నెలలు నిద్ర లేకుండా చేసింది
– కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీ మారినా కాంగ్రెస్‌లోకే వచ్చానన్నారు. కేసీఆర్ నియంత పాలనను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో నన్ను ఓడించేందుకు కేసీఆర్ వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడాడని.. మునుగోడు వాసులు తలదించుకునే పని ఎన్నడూ చేయలేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆనాడు ఎంపీగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ గొంతు వినిపించి రాష్ట్రం తీసుకోరావడానికి కష్టపడ్డానన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో పోయిందని ఆరోపించారు. ఆ కుటుంబాన్ని గద్దె దించడానికి తాను పోరాడుతున్నానన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్షమంది ఉన్నారన్నారు. మునుగోడు ఉద్యమాల గడ్డ అని, ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్‌ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసింది మునుగోడు గడ్డ అని ఆయన అన్నారు. తాను అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్నారని, తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తానని తాను ఏఐసీసీకి చెప్పానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పుచేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతుందన్నారు. ధరణి పోర్టల్‌తో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.