– తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన యశోద హాస్పిటల్ డాక్టర్లు
– హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు
ఇదే నిజం, హైదరాబాద్: బాత్రూంలో కాలుజారి పడటంతో కేసీఆర్ గాయపడ్డారు. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. సర్జరీ నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే మెడికల్ టెస్టులు పూర్తయ్యాక సర్జరీపై డాక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి(హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ) చేయాలని తెలిపారు.‘బాత్రూమ్లో జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలి. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు’అని హెల్త్ బులెటిన్లో డాక్టర్లు పేర్కొన్నారు.
కేసీఆర్ తొందరగా కోలుకోవాలి: ప్రధాని మోడీ ట్వీట్
కేసీఆర్కు గాయం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
అందరి ప్రార్థనలతో కేసీఆర్ కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో కేసీఆర్ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. కేసీఆర్కు స్వల్ప గాయమైందని.. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత పేర్కొన్నారు.