మరో రెండు రోజుల్లో రంజాన్ పండగ రానుంది. దీంతో వరుస సెలవుల నేపథ్యంలో ఓటీటీల్లోకి కొన్ని కొత్త సినిమాలను తీసుకొస్తున్నారు. ఈ వారం ఓటీటీల్లోకి కొన్ని తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తోపాటు మరికొన్ని హిట్ డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూడండి.
గామి – జీ5 ఓటీటీ
మార్చి 8న థియేటర్లలో రిలీజైన విశ్వక్ సేన్ గామి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన ఈ సినిమా నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి గామి మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చేసిన మ్యాజిక్ ఓటీటీలోనూ చేస్తుందేమో చూడాలి.
ఓం భీమ్ బుష్ – ప్రైమ్ వీడియో
గత నెలలోనే రిలీజైన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోమవారమే సదరు ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది.
లాల్ సలామ్ – సన్ నెక్ట్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయినా.. ఓటీటీలోకి మాత్రం చాలా ఆలస్యంగా వస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో లాల్ సలామ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
సైరన్ – హాట్‌స్టార్
జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ సైరన్. ఈ తమిళ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ రాబోతోంది. ఆంటోనీ భరద్వాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 11) నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రేమలు – హాట్‌స్టార్/ఆహా ఓటీటీ
మలయాళం సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రేమలు ఇదే వారం ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సినిమా అన్ని భాషలు మొదట డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమ్ అవుతాయని భావించినా కేవలం మూడు భాషలు అంటే మలయాళం, తమిళం, హిందీ మాత్రమే అందులో శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీలోకి రానుంది. అదే రోజు నుంచి ఆహా ఓటీటీలో ప్రేమలు తెలుగు కూడా స్ట్రీమింగ్ కానుంది.
ఇవే కాకుండా ఇప్పటికే లంబసింగి, భీమా, సుందరం మాస్టర్, లవర్ లాంటి తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఫ్యామిలీతో కలిసి వీటిని చూసేయండి.