ఇదేనిజం, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి జీవన్‌రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా అడ్డుతగిన మహిళలు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆసరా పింఛన్ ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదని వృద్ధులు నిలదీశారు. జనవరి నెలలో ఎగ్గొట్టిన పింఛన్ ఎప్పుడు ఇస్తారని అడిగారు. కల్యాణలక్ష్మి చెక్కులు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మళ్లీ ఓట్లడుగుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు ఎకరాల కంటే అధికంగా ఉన్నవారికి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తమకు ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి ప్రసంగానికి అడ్డుతగలొద్దని ఎమ్మెల్యే వారించినప్పటికీ వారు ఎంతకూ శాంతించకపోవడంతో మధ్యలోనే ప్రచారాన్ని ముగించుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.