Homeహైదరాబాద్latest Newsగంజాయి మత్తులో యువత

గంజాయి మత్తులో యువత

– విచ్ఛలవిడిగా వాడుతున్న యువకులు
– మత్తులో ఘర్షణకు దిగుతున్న పోకిరీలు
– పట్టించుకోని సంబంధిత అధికారులు

ఇదేనిజం, కరీంనగర్​: నిషేధిత గంజాయి మత్తులో కరీంనగర్​ పట్టణ యువత తూగుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి చాప కింద నీరులా నగరంలో విస్తరించింది. సంతోషం వచ్చినా.. ! కష్టం వచ్చినా..! సందర్భం ఏదైనా యువత గంజాయి మత్తులో ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో పలు చోట్ల యథేచ్ఛగా గంజాయి సరఫరా అవుతున్నది. పాఠశాలలో చదివే విద్యార్థుల నుంచి కళాశాలకు వెళ్లే విద్యార్థుల వరకు గంజాయి బారిన పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో యువత ఏం చేస్తున్నారో అర్థం కాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇటీవల నగరంలోని ఓ ప్రాంతంలో ఓ పెద్ద మనిషి వెళ్తుండగా, ఇద్దరు యువకులు ఘర్షణకు దిగడం కనిపించింది. పిల్లలు గొడవ పడుతున్నారని వారిని ఆపుదామని ఈ పెద్ద మనిషి వెళ్లగా, ఆ యువకులు మత్తులో అతనిపై చేయి చేసుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ గొడవ కాస్తా, పోలీసుల వరకు వెళ్లి, పరస్పరం ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లింది. మరో ప్రధాన వ్యాపార సముదాయం వద్ద రాత్రి ఓ యువకుడు మత్తులో హల్​చల్​ చేసి, స్థానికులను ఇబ్బందులకు గురి చేశాడు. ఇలా మత్తులో యువత తూగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నగరంలోని ఓ పార్టీ కార్యాలయం వెనుక గంజాయి బ్యాచ్​ ఎంజాయ్​ చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు. వారిపై ఫిర్యాదు చేస్తే, రేపటి రోజు మత్తులో వచ్చి, తమపై ఎక్కడ దాడికి పాల్పడుతారోనని భయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– ఆందోళనలో తల్లిదండ్రులు

గంజాయి మత్తులో పిల్లలు చేసే వికృత చేష్టలకు తల్లిదండ్రులు బయటకు చెప్పుకుందామంటే పరువు పోతుందని, చెప్పకుంటే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని తల్లిదండ్రులు లోలోన కుమిలిపోతున్నారు. కొందరూ తమ పనులు చేయించుకునేందుకు, ఇతరులపై శత్రుత్వాన్ని తీసేందుకు తమ పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారని వాపోతున్నారు. కాయకష్టం చేసుకునే తల్లిదండ్రుల పిల్లల నుంచి ఉద్యోగస్తుల పిల్లలు సైతం గంజాయి మత్తులో మునిగిపోతున్నారు. గంజాయి మత్తులో యువత బైక్ రైడింగ్ చేస్తూ ప్రయాణికులను హడలెత్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. మత్తులో గంజాయి బ్యాచ్ చోరీలకు పాల్పడడం, పాదచారులను వాహనదారులను భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారింది. సాయంత్రం అయితే చాలు రోడ్డుపై వెళ్లాలంటే సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు నిద్రావస్థలో ఉండడం విస్మయానికి గురి చేస్తుంది. నిఘా వ్యవస్థ మేల్కొని అసాంఘిక వ్యక్తులపై గట్టి నిఘాగా వేసి, గంజాయి సరఫరా చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. గంజాయి చాప కింద నీరులా సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి బ్యాచ్ పోలీసులకు చిక్కినా, చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. యువత పెడదోవ పట్టకుండా నిషేధిత గంజాయి సరఫరా జరగకుండా నిఘా వ్యవస్థ నిఘా ఎంతైనా అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img