Homeహైదరాబాద్latest Newsసంజయ్.. నీ కిది తగునా.. ఇంకా షాక్​ లోనే గులాబీ బాస్​ కేసీఆర్..!

సంజయ్.. నీ కిది తగునా.. ఇంకా షాక్​ లోనే గులాబీ బాస్​ కేసీఆర్..!

  • సంజయ్ వెళ్లిపోవడాన్ని తట్టుకోలేపోతున్న బీఆర్ఎస్ కేడర్​
  • ఇంకా షాక్​ లోనే గులాబీ బాస్​ కేసీఆర్​
  • కంటి డాక్టర్ ను మాస్​ లీడర్​ చేసిన బీఆర్ఎస్​ పార్టీ
  • సంజయ్ గెలుపు కోసం శ్రమించిన కేసీఆర్, హరీశ్, కేటీఆర్
  • సొంతమనిషిలా, ఇంటి మనిషిలా సహకారం
  • గడపడగపకూ తిరిగిన కవిత

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కడియం శ్రీహరి పార్టీ మారితే ఎవరూ ఆశ్చర్యపోలేదు. దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఎవరూ షాక్ అవ్వలేదు.. తెల్లం వెంకట్రావు, పోచారం గులాబీ పార్టీని వీడినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లు కాబట్టి.. వెళ్లిపోయారని అంతా అనుకున్నారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్​ పార్టీ మారడాన్ని ఎవ్వరూ ఊహించలేపోయారు. బీఆర్ఎస్ కేడర్​ మాత్రం ఆ వార్త నిజమేనా? అన్నట్టుగా ఒకటి రెండు సార్లు క్రాస్​ చెక్ చేసుకున్నది. అంతలా బీఆర్ఎస్​ పార్టీకి సంజయ్​ తో అనుబంధం ఉంది. సంజయ్ బీఆర్ఎస్ పార్టీ తయారు చేసిన నేత. గులాబీ తోటలోనే పుట్టిన మొక్క. బీఆర్ఎస్ పార్టీలో ఓనమాలు నేర్చుకొని.. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి, ఏ లీడర్​ పొందలేనంత సహాయసహకారాలు పొందిన లీడర్. అందుకే ఆయన పార్టీ మారుతున్నారంటే అంతా ఆశ్చర్యపోయారు. సంజయ్​ తల్లి పాలు తాగి రొమ్మును గుద్దారంటూ బీఆర్ఎస్ కేడర్​ మండిపడుతోంది.

ఎవరీ సంజయ్?
సంజయ్ కుమార్​ జగిత్యాల పట్టణంలో ఓ కంటి డాక్టర్​. ఆయనను బీఆర్ఎస్ పార్టీ చేరదీసి ఎమ్మెల్యేను చేసింది. అందుకు కారణం జగిత్యాల సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కావడమే. అక్కడ సీనియర్ కాంగ్రెస్​ లీడర్ జీవన్​ రెడ్డి తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఆయనను ఓడించడం అంత ఈజీ కాదు.. అందుకే అక్కడ బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెదికింది. జీవన్​ రెడ్డి 2006 జరిగిన ఉప ఎన్నికలో కరీంనగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్​ మీద పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ గట్టి పోటీ ఇవ్వగలిగారు. 2014 లో తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్​ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి. అందుకే ఆయనను ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ భావించింది. అందుకే నిజాయితీ పరుడు, రాజకీయాలతో ఏ సంబంధం లేని సంజయ్ కుమార్ ను​ బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ చేరదీశారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ.. 2019 నాటికి ఆయనను బలంగా తయారు చేశారు. ఇటు కేసీఆర్​, అటు కేటీఆర్, హరీశ్​ రావు, కవిత ఇంతమంది సంజయ్​ గెలుపుకోసం పనిచేశారు. ఆయన ఆర్థికంగా, రాజకీయంగా సహాయసహకారాలు అందించారు. కవిత తన సొంత నియోజకవర్గంలాగే జగిత్యాలను అభివృద్ధి చేశారు. ఊరూరు తిరిగి.. గడపగడపకు వెళ్లి సంజయ్​ తరఫున ప్రచారం చేశారు. అందరి కృషితో 2019, 2023 రెండు దఫాలు సంజయ్ గెలవగలిగారు.

ఎంతో వ్యతిరేకత వచ్చినా 2023లో టికెట్..
సంజయ్ కుమార్​ మీద 2023లో నియోజకవర్గంలో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఆయన కమీషన్లు తీసుకుంటున్నారంటూ సొంత పార్టీ నుంచే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ కేసీఆర్​ మాత్రం సంజయ్​ కుమార్ కే టికెట్ ఇచ్చారు. సంజయ్​ కుమార్​ ఎన్నికల ఖర్చును కూడా కేసీఆర్​ భరించినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణను చేర్చుకున్నది కూడా కేవలం సంజయ్ కుమార్​ కోసమే. రమణకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. సంజయ్​ గెలుపు బాధ్యతను ఆయన భుజస్కందాల మీద పెట్టారు కేసీఆర్​.

గుట్టుచప్పుడు కాకుండా..
సహజంగా పార్టీ మారబోయే నేతలు ముందుగా కొంత హడావుడి చేస్తారు. మీడియాకు లీకులు ఇస్తారు. కార్యకర్తలతో సమావేశం పెడతారు. ఆ తర్వాత ప్రెస్​ మీట్ పెడతారు. తాము పార్టీ ఎందుకు మారుతున్నామో కారణాలు వివరిస్తారు. కానీ ఇదేమీ జరగకుండానే సంజయ్​ కుమార్​ గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాను పార్టీ మారబోయే విషయం అత్యంత గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. కనీసం భార్యకు, కుటుంబసభ్యులకు కూడా ఈ విషయం తెలియదట. అంత సెడన్​ గా అంత సీక్రెట్​ గా కారు డ్రైవర్​ కు కూడా విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు సంజయ్. దీంతో సంజయ్​ పార్టీ మార్పు వార్త విని.. అటు కరీంనగర్​ ప్రజానికం.. బీఆర్ఎస్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

వియ్యంకుడి రాయభారం
ఇక సంజయ్​ కుమార్​ పార్టీ మార్పు విషయంలో ఆయన వియ్యంకుడు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. సంజయ్​ కుమార్​ వియ్యంకుడిది పాలమూరు జిల్లా.. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరి మనిషి.. దీంతో ఆయన వీరిద్దరి మధ్య రాయభారం కుదిర్చినట్టు తెలుస్తోంది. ఇక సంజయ్ సొంత నియోజవర్గమైన జగిత్యాలలో భారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కడుతున్నారు. ప్రస్తుతం ఆ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి కాంట్రాక్టర్​ సంజయ్ వియ్యంకుడే. కాంగ్రెస్​ అధికారంలో ఉంది కాబట్టి.. వాటికి సంబంధించిన బిల్లులు వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ హామీ మీదే సంజయ్​ పార్టీ మారినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సంజయ్​ పార్టీ మార్పు వ్యవహారం బీఆర్ఎస్ ను ఓ కుదుపుకుదిపేసింది.

Recent

- Advertisment -spot_img