- సీఎం పదవి లెక్క కాదు
- త్యాగాల చరిత్ర మనది
- కల్యాణ లక్ష్మి లేదు.. కేసీఆర్ కిట్ రాదు.. రైతు బంధు పైసలు పడవు
- బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల లాంటి కార్యకర్తలున్నరు
- కొంతమంది పోయినంత మాత్రాన నష్టం లేదు
- బీఆర్ఎస్ నాయకులను సృష్టించింది
- లీడర్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు
- కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: సీఎం పదవి అనేది తనకు లెక్క కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కంటే గొప్ప ఏముంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీది త్యాగాల చరిత్ర అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పిందని విమర్శించారు. తనకు తెలంగాణ సాధించిన ఘనత కంటే వేరే గొప్పతనం ఏముంటుందని ప్రశ్నించారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘శిథిలమైన తెలంగాణలో సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళితే అర్థమౌద్ది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. “పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది’ అని జనం అనుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేవన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా సరిగా లేదన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ కోసం సాగిన మన 25 ఏండ్ల సుధీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. నాడు ఎన్టీఆర్‌ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని.. అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుందని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ అధినేత ప్రకటించారు.
రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతున్నదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగ జారుకుంటూ వస్తున్నదని విశ్లేశించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని సందర్శకుల చప్పట్లు నడుమ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫాం ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారని అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని కార్యకర్తలకు అధినేత పిలునిచ్చారు.