Homeహైదరాబాద్latest Newsపీసీసీ చీఫ్ ఎవరికిద్దాం?.. అధిష్ఠానం ముమ్మర కసరత్తు..!

పీసీసీ చీఫ్ ఎవరికిద్దాం?.. అధిష్ఠానం ముమ్మర కసరత్తు..!

  • రేవంత్ వరంగల్ పర్యటన వాయిదా
  • కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే మకాం
  • అధిష్ఠానం ముమ్మర కసరత్తు
  • కేబినెట్ ఆశావహులు కూడా అక్కడే మకాం
  • భట్టి విక్రమార్కకు హస్తిన నుంచి పిలుపు
  • హుటాహుటిన బయలుదేరిన డిప్యూటీ సీఎం
  • మధుయాష్కి గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ ముమ్మర ప్రయత్నాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పీసీసీ చీఫ్ ఎవరు? ఇందుకోసం అధిష్ఠానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. కేబినెట్ లో చోటు కోసం ఆశావహులు హస్తినలోనే ఉన్నారు. పీసీసీ చీఫ్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో గురువారం రాష్ట్ర పర్యటనలో ఉన్న హుటాహుటిన బయలు దేరి వెళ్లారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ప్రకారమైతే.. రేపు (జూన్ 28న) వరంగల్‌‌లో పర్యటించాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ లాంటి కీలకమైన విషయాలతో అధిష్ఠానంతో చర్చిస్తోన్న రేవంత్ రెడ్డి.. రేపు కూడా పార్టీ పెద్దలతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీంతో.. నేటి వరంగల్ పర్యటన వాయిదా పడినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సహా.. పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలపై భేటీ అవుతున్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలతో పాటు.. పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే.. అటు పీసీసీ చీపీ, కేబినెట్ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. కాగా.. పీసీసీ పదవి నుంచి తాను తన కర్తవ్యం నిర్వర్తించానని.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ ఉదయం మీడియా సమావేశంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ పదవి ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎవరైతే సరిగ్గా సరిపోతారన్న అభిప్రాయాన్ని అధిష్ఠానంతో చెప్పినట్టు సమాచారం. తన పరిశీలనలో ఉన్న పలువురి పేర్లను అధిష్ఠానం ముందు ఉంచగా.. ఆ పేర్లపై పెద్దలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే.. రేవంత్ రెడ్డి రేపు కూడా అక్కడే ఉండాల్సివస్తోందని టాక్. అయితే.. రేపు కొత్త పీసీసీ పేరు ఖరారవుతుందా.. లేదా ఇంకా టైం పడుతుందా అన్నది సస్పెన్సే.

ఇదిలా ఉంటే.. రేపు వరంగల్ పర్యటకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడన్న నేపథ్యంలో.. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరంగల్ పర్యటన నేపథ్యంలో… మొదట పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా జౌళి టెక్స్‌టైల్‌ పార్క్‌‌ను ఆయన సందర్శిస్తారని… ఆ తర్వాత హన్మకొండలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారని.. అనంతరం నయీమ్‌నగర్‌లోని నాలా పనులను పరిశీలించాక కలెక్టరేట్‌లో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారని పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. కట్ చేస్తే.. సీఎం రేపటి పర్యటన రద్దయింది.

Recent

- Advertisment -spot_img