తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ మరియు కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు మాట్లాడరని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అనుభవజ్ఞుడని చెప్పుకునే కేసీఆర్ ఎక్కడో దాక్కున్నారు. మోదీ చూస్తే ఏమవుతుందోననే భయంతో సభకు రాలేదు. సభను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ యత్నిస్తున్నారు. సభ నుంచి వారిని ఎట్టిపరిస్థితుల్లో బయటకు పంపించొద్దు. తాను తాత పేరు, తండ్రి పేరు చెప్పుకుని సభకు రాలేదని.. స్వయంకృషితో ఇక్కడి దాకా వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బహిర్గతం కావాల్సిందేనన్నారు. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతుండగా.. తీర్మానం కాపీ రాలేదని కేటీఆర్ అనడం సమంజసం కాదన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చకు రాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్నారన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. ‘‘తీర్మానంపై మాకు జవాబు చెప్పండి చాలు.. మీకు కేసీఆర్ అక్కర్లేదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సహనంతో ఉండాలి. సంయమనం కోల్పోవడం సరికాదు. అసలు ఇది తీర్మానమా? లఘు చర్చనా? అర్థం కావడం లేదు’’ అని అన్నారు.