ఇదే నిజం, శేరిలింగంపల్లి: నిన్న అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు యావత్ మహిళా సమాజాన్ని కించపరిచాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ చౌరస్తాలో నాయకుల తో కార్యకర్తల లతో కలసి రవీందర్ యాదవ్ నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒక నిండు చట్టసభలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రా రెడ్డిని, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ వెనకాల కూర్చున్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీహిల్స్ బస్టాండ్ లో అడుక్కోవడమే తప్ప ఇంకోటి ఉండదని మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని, ఈ మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం నీచమైన చర్యని అన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థలో మహిళలకు అగ్రస్థానం ఉన్నదని,”ఎత్రానర్యస్తు పూజ్యంతే – తత్రారమంతే దేవత”అని మహిళలను గౌరవించుకునే సమాజంలో, చట్టసభల్లో అనుభవం కలిగిన మహిళా ఎమ్మెల్యేలను కించపరిచినట్లు మాట్లాడడం రేవంత్ రెడ్డి నీచమైన రాజకీయాలకు నిలువుటద్దమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తామని రవీందర్ యాదవ్ హెచ్చరించారు.