Homeహైదరాబాద్latest Newsబీజేపీ ఇచ్చే అక్షింతలు.. ప్రసాదాలతో అభివృద్ధి జరగదు: కేసీఆర్

బీజేపీ ఇచ్చే అక్షింతలు.. ప్రసాదాలతో అభివృద్ధి జరగదు: కేసీఆర్

ఇదే నిజం, తెలంగాణ: బీజేపీ ఇచ్చే అక్షింతలు, ప్రసాదాలతో అభివృద్ధి జరగదని బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్ విమర్శించారు. కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రెండో రోజు సూర్యాపేట నుంచి ప్రారంభమైన కేసీఆర్‌ బస్సు యాత్ర.. అర్వపల్లి, తిరుమలగిరి, పెంబర్తిమీదుగా భువనగిరి చేరుకుంది. ఎంపీ అభ్యర్థితో కలిసి ర్యాలీగా వచ్చిన కేసీఆర్‌ భువనగిరి చౌరస్తాలో ప్రసంగించారు. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని, మరొక పార్టీ ఎక్కడికి వెళితే అక్కడ దేవుడిపై ఒట్టు వేస్తోందని మండిపడ్డారు. అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించుకున్నామని, ఏనాడూ ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అంటున్న కాంగ్రెస్‌.. భువనగిరిలో చేసింది ఏంటని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ములాఖత్‌ అయ్యాయన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉంటే అవేమీ పట్టనట్టు.. అక్షింతలు, ప్రసాదాలు, శోభాయత్రలపైనే బీజేపీ దృష్టి పెట్టిందని కేసీఆర్‌ విమర్శించారు. ఇక్కడో కేంద్ర మంత్రి ఉన్నా.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని, రెప్పపాటు కరెంటు పోకుండా చూసుకున్నామన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. భగవంతుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని, ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ అభివృద్ధే లక్ష్యమన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చింది. మహిళలకు రూ.2500 ఇస్తమన్నరు.

గృహజ్యోతితో అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని ఇవాళ జనం మొత్తుకుంటున్నరు. ఆడపిల్లలకు, యువతులకు, చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు రాలేదు కానీ.. లూటీలు మాత్రం వస్తున్నాయి’ అంటూ అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. ‘పేదపిల్లలు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశాం. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభిస్తే.. కాంగ్రెస్‌ చేసిందని మేం ఆపలేదు. దాన్ని కొనసాగించాం. అందరూ పిల్లలకు ఇచ్చాం. అన్ని కులాలకు ఇచ్చాం. 1,100 గురుకులాలు పెట్టాం. బ్రహ్మాండంగా పిల్లలు చదువుకొని కలెక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు’ అని ఆయన గుర్తు చేశారు.

రీయింబర్స్​మెంట్ ఎక్కడ?
ఇవాళ ఒక్క ప్రైవేటు కాలేజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ సర్కారు ఏర్పాటై 5 నెలలైనా కాలేజీల్లో జీతాలు ఇవ్వడం లేదు. మరి పిల్లలకు చదువు ఎలా చెబుతారు. పరీక్షలు ఎలా జరుగుతాయి. అంతా ఆగమాగం చేశారు. గురుకులాల్లో పిల్లలకు కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో ఉన్నారు. నలుగురు పిల్లలు చనిపోయారు. ఇదే భువనగిరిలో ఓ అమ్మాయి చనిపోయింది. ఇదేనా జరగాల్సిన పద్ధతి?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

మహిళలకు రూ.2,500 వచ్చాయా?
బీఆర్ఎస్ పాలనలో రైతులకు రూ.30 వేల కోట్లు రెండుసార్లు మాఫీ చేశామని కేసీఆర్ తెలిపారు. ‘ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు. రైతులను తొందరగా వెళ్లి రూ.2లక్షలు తెచ్చుకోమన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్ ప్రభుత్వం 10.30గంటలకే తొలి సంతకం.. మొత్తం రూ.2లక్షల మాఫీపై అన్నారు. మరి రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా? కల్యాణలక్ష్మికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా? తులం తుస్సుమన్నదా? బోనస్‌ బోగస్‌ అయ్యిందా? మహిళలందరికీ నెలకు రూ.2500 ఇస్తామన్నరు. ఏ మహిళకైనా రూ.2500 వచ్చాయా ?’అని కేసీఆర్ ప్రశ్నించారు.

నా గుండెను చీలిస్తే కనిపించేంది తెలంగాణే..
నా గుండెని చీలిస్తే కనిపించేది తెలంగాణేనని.. ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తానని కేసీఆర్ తెలిపారు. రైతులకు గానీ.. ఎవరికైనా మోసం జరిగినా.. అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్‌కు పంచాది పడ్డది. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేది ఎవరు? కేసీఆరే? భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. ఈ తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలని.. నా ప్రాణంపెట్టినా ఫర్వాలేదని ఆనాడు బయలుదేరాను. ఆనాడు ఎవరూ రాలేదు. యువకులు, విద్యార్థులు, మహిళలంతా కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయ్యింది. రాష్ట్రం తెచ్చుకున్నాం. పదేళ్లు మంచిగ చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకున్నాం. కరెంటు బాగా చేసుకున్నాం. ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నం. ఆ విధంగా ముందుపోయాం. మొన్న ఓ సుడిగాలి.. దుర్మార్గపు గాలి వచ్చింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. నాకు బాధలేదు. పార్టీ అంటే ఓడినా.. గెలిచినా ప్రజల్లో ఉండాలి. ప్రజల కోసం పని చేయాలి. అదే పార్టీ. ఇవాళ తెలంగాణలో లక్షల మంది క్యాడర్‌ బీఆర్‌ఎస్‌కు ఉంది’ అని కేసీఆర్ తెలిపారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవాలని కేసీఆర్ తెలిపారు. భువనగిరిలో క్యామ మల్లేశ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలన్నారు.

రైతున్నకు ధైర్యం చెప్పిన కేసీఆర్
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్ర రెండో రోజైన గురువారం సూర్యాపేట నుంచి భువనగిరి చేరుకుంది. మార్గమధ్యలో ఎర్కారం గ్రామ సమీపంలోని దుబ్బ తండా రైతు ధరావత్‌ నర్సింహాను కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా తన పొలానికి నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయిందని నర్సింహా ఆవేదన వ్యక్తం చేశారు. కండ్ల నీళ్లు పెట్టుకున్న రైతు ధరావత్‌ నర్సింహాకు కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. తన ఐదెకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో ఆవేదనతో పొలంలోనే బాధపడ్డ రైతు ధరావత్‌ నర్సింహా వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే తన రోడ్‌ షోలో భాగంగా దుబ్బా తండా వద్ద ఆగిన కేసీఆర్‌ ధరావత్‌ నర్సింహాను కలిసి ధైర్యం చెప్పారు.

Recent

- Advertisment -spot_img