Homeహైదరాబాద్latest NewsALERT: ఫెడెక్స్ కొరియర్ పేరుతో భారీ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

ALERT: ఫెడెక్స్ కొరియర్ పేరుతో భారీ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ డిజిటల్​ లావాదేవీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్​ నేరాలూ అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ప్రజల్ని ఎంత అప్రమత్తం చేసినా సైబర్​ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ఇటీవల సైబర్​ నేరగాళ్లు ఫెడెక్స్ కొరియర్​ పేరుతో దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్యే బెంగళూరులోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్ ప్రొఫెసర్​ వీరి బారిన పడి దాదాపు రూ.83 లక్షలు పొగొట్టుకున్నారు. మేము కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్​ చేసి ‘మీకో పార్సిల్​ వచ్చింది. అందులో నిషేధిత డ్రగ్స్ ఉన్నాయి. మీపై కేసు నమోదు చేస్తున్నాం’ అంటూ ఆయన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అలా జరగకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని హెచ్చరించారు. దీంతో ప్రొఫెసర్​ దఫదఫాలుగా నేరస్థులకు రూ.83 లక్షల వరకు పంపించారు. చివరికి మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫెడెక్స్ కొరియర్​ పేరిట గతేడాది మొత్తం 163 కేసులు నమోదయ్యాయని, సైబర్​ నేరగాళ్లు రూ.5కోట్ల మేర లూటీ చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసులు హైదరాబాద్​లోనూ భారీగా నమోదవుతున్నాయి. కామారెడ్డి జిల్లాకి చెందిన ఓ ప్రొఫెసర్​ సైతం వీరి బారిన పడి, పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు. బాధితుల్లో కొందరు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నా.. మరికొందరు పొగొట్టుకున్న డబ్బును తిరిగి పొందలేమనే అభద్రతా భావంతో, ఇంకొందరు పరువు ప్రతిష్ఠలకు భయపడి కనీసం ఫిర్యాదులు కూడా చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనవసర, అనుమానిత లింక్​లపై క్లిక్​ చేసి డబ్బు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అసలేంటీ ఫెడెక్స్ కొరియర్​?
ఫెడెక్స్ అనేది ఓ అంతర్జాతీయ కొరియర్​ సంస్థ. ఇది దేశదేశాల్లోని తమ కస్టమర్లకు వస్తువులను చేరవేస్తూ ఉంటుంది. అయితే దీని పేరిట నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి భయభ్రాంతులకు గురి చేసి సొమ్ము లూటీ చేసేవి. రెండోది మీకు ఆఫర్​ వచ్చిందంటూ ఆశ పెట్టి ప్రలోభాలకు గురి చేసి సొమ్ము దోచేసేవి. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్​ చేసి మేం కస్టమ్స్ అధికారులమని చెబుతారు. మీ పేరిట ఓ పార్సిల్​ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయి. మీరు మాదక ద్రవ్యాలతో వ్యాపారం చేస్తున్నారని, మీపై కేసు నమోదవుతుందని, జీవితాంతం జైలో ఉంటారని భయపెడతారు. నమ్మేందుకు గాను వీడియో కాల్స్ చేసి నకిలీ ఐడీ కార్డులు, పోలీసు యూనిఫామ్, రిజర్వ్ బ్యాంకు వంటి తదితర నకిలీ పత్రాలు చూపిస్తారు. డబ్బు చెల్లించకపోతే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అందిన కాడికి దోచుకుంటారు. ఇదే విధంగా ఉన్నతాధికారులమంటూ ఫోన్​ చేసి మీ పేరిట అగ్రదేశాల నుంచి పార్సిల్​ వచ్చిందని, అందులో బంగారం, నగదు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయని చెబుతారు. పార్సిల్​ మీ వరకు రావాలంటే కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలుకుతారు. సాధారణ ప్రజలు ఇటువంటి వారి వలలో చిక్కి వారికి అనధికారికంగా డబ్బు చెల్లిస్తారు. రెండ్రోజుల్లో వస్తుంది, ఒక రోజులో వస్తుంది అంటూ ఏదో ఓక సాకు చెబుతూ మరింత ఆశ పెట్టి డబ్బు గుంజుతారు. తీరా మోసపోయిన తర్వాత ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ దొరకదు కదా కనీసం ఫోన్​ చేసి మాట్లాడిన వాళ్ల ఫోన్లు కూడా పని చేయవు. ఈ విధంగా సైబర్​ నేరస్థులు ఊసరవెల్లిలా వేషాలు మారుస్తూ అమాయక ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నారు.

అప్రమత్తతే కీలకం.!
ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మొదట సైబర్​ పోలీసులను సంప్రదించాలి. రూ.లక్ష విలువ చేసే వస్తువు రూ.10వేలకే వస్తుందని వచ్చే ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అలాగే మీరే తప్పూ చేయనప్పుడు ఎవరికో గుర్తు తెలియని వ్యక్తులకు భయపడనవసరం లేదు. డిజిటల్​ దోపిడీకి గురైనప్పుడు వెంటనే సంబంధిత ఆధారాలతో సైబర్​ క్రైమ్​ పోర్టల్​లో ఫిర్యాదు చేయాలి. లేదంటే సొమ్ము పోగొట్టుకున్న 24 గంటల్లో 112 / 1930 టోల్​ ఫ్రీ నంబర్లకు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయొచ్చు. మోసపోయామని గుర్తించిన తర్వాత ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత తొందరగా మీరు పోగొట్టుకున్న డబ్బు వెనక్కి పొందవచ్చు. యూపీఐ పిన్​ నంబరు, ఓటీపీ, తదితర బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుకోవాలి. నివారణ కంటే అప్రమత్తత ముఖ్యం. మనం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆశా, భయాలకు లోనుకాకుండా ఉంటే సైబర్​ నేరగాళ్ల నుంచి తప్పించుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img