– గుండెపోటుతో చనిపోయిన ఐఎస్‌వైఎఫ్ చీఫ్ లఖ్‌బీర్ సింగ్ రోడే
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో మరో ఖలిస్థానీ ఉగ్రవాది మృతి చెందాడు. ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) సంస్థలకు చీఫ్ అయిన లఖ్‌బీర్ సింగ్ రోడే డిసెంబర్ 2న గుండెపోటుతో మరణించాడు. అతడిని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. రోడే మరణాన్ని భారత్‌లో ఉంటున్న అతడి సోదరుడు జస్‌బీర్ సింగ్ ధ్రువీకరించాడు. కెనడాలో ఉంటున్న లఖ్‌బీర్ కుమారుడి నుంచి తనకు ఈ సమాచారం అందిందని పేర్కొన్నాడు. పాక్‌లోనే అతడి అంత్యక్రియలను పూర్తిచేసినట్లు వెల్లడించాడు. ఖలిస్థానీ ఉగ్రవాది భింద్రన్‌వాలేకు లఖ్‌బీర్ సమీప బంధువు. ఇటీవల అతడికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవాలని మొహాలీలోని ఎన్‌ఐఏ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 2021లో ఫాజిల్కా జిల్లా జలాలబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి ఇతడిపై కేసు నమోదైంది.
1984లో ప్రారంభమైన ఐఎస్‌వైఎఫ్ సంస్థ కెనడా, యూకేలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికా విదేశాంగశాఖ దీనిని ఉగ్రసంస్థగా ప్రకటించింది. 2002లో పోటా చట్టం కింద భారత్ దీనిపై నిషేధం విధించింది. ఉగ్రసంస్థ లష్కరేతో దీనికి సంబంధాలున్నాయి. చాలా దేశాలు దీనిపై నిషేధం విధించడంతో సిఖ్ ఫెడరేషన్‌గా పేరు మార్చుకొంది. పంజాబ్‌లో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించేందుకు రోడే పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో కలిసి పనిచేశాడు. గతంలో పంజాబ్‌లో చోటు చేసుకొన్న పలు టిఫిన్ బాంబు ఘటనల్లో రోడే హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పంజాబ్‌లో స్వాధీనం చేసుకున్న ఆర్డీఎక్స్, టిఫిన్ బాంబులకు సంబంధించిన కేసులో ఇతడి సోదరుడు జస్‌బీర్ సింగ్‌ను కూడా గతంలో పోలీసులు అరెస్టు చేశారు. 2020లో శౌర్యచక్ర గ్రహీత బల్వీందర్ సింగ్ హత్య లఖ్‌బీర్ సూచనలతోనే జరిగింది. పంజాబ్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను చేరవేస్తున్నరని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్ ఈ ఏడాది రోడేతో పాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసింది. ఇక పాక్‌లో నక్కిన చాలా మంది ఉగ్రవాదులు ఇటీవల హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. మే నెలలో ఖలిస్థానీ కమాండో ఫోర్స్ అధినేత పరంజీత్ సింగ్ పన్వార్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చిచంపారు