– హఫీజ్ సయీద్ అనుచరుడిని కాల్చి చంపిన దుండగులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గత కొంతకాలంగా కీలక ఉగ్ర నేతలు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. తాజాగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుడిని కొందరు వ్యక్తులు కాల్చిచంపారు. కరాచీలో డిసెంబరు 2న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సయీద్ అనుచరుడు హంజ్లా అద్నాన్ తన ఇంటి బయట ఉండగా.. కొందరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అద్నాన్‌ను పాక్ ఆర్మీ రహస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ చికిత్స పొందుతూ అద్నాన్ మంగళవారం చనిపోయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. 2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి అద్నాన్ సూత్రధారి.
ఆ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమరులవ్వగా.. మరో 13 మంది గాయపడ్డారు. ఇక, 2016లో కశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై భారత ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అద్నన్ తన కార్యకలాపాలు సాగించేవాడని, భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తూ దాడులు చేయించాడని నిఘా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. పాక్‌లో గత కొన్ని నెలలుగా వరుసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఈ వరుస హత్యలతో లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్‌కు కూడా భారీ దెబ్బలు తగిలాయి. ఈ ముఠా అధినేతల దగ్గరి అనుచరులు, టాప్ కమాండర్లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. దీంతో ఈ ఉగ్రమూకలకు భయం పట్టుకుంది. చాలా మంది రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వరుస హత్యలతో పాక్ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రత్యర్థులు, ఇతర ఉగ్ర గ్రూపుల పాత్ర, అంతర్గత విభేదాల వంటి కోణాలను పరిశీలిస్తున్నాయి.