Homeఫ్లాష్ ఫ్లాష్ap assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

ap assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

– మీసం మెలేసిన బాలకృష్ణ
– తొడగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్​ రెడ్డి
– చంద్రబాబు అరెస్ట్​పై చర్చించాలంటూ టీడీపీ సభ్యుల ఆందోళన
– స్పీకర్​ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు
– తీవ్ర నిరసనల మధ్య సభ వాయిదా

ap assembly: ఇదేనిజం, హైదరాబాద్​: ఏపీ అసెంబ్లీలో గురువారం తీవ్ర గందరగోళం చోటు చేసుకున్నది. సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్​ పై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్​ పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి చెప్పారు. బీఏసీ మీటింగ్​ లో ఈ విషయంపై చర్చిద్దామన్నారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వినలేదు. సభలో నినాదాలు చేశారు. స్పీకర్​ పోడియంను చుట్టుముట్టారు. చివరకు స్పీకర్​ లేచి నిలబడి సభ్యులకు నమస్కారం చేశారు. అయితే టీడీపీ సభ్యులు తమ చేతిలోని పేపర్లను విసిరి స్పీకర్​ మీదకు పడేసినట్టు వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అనంతరం టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే సభను 10 నిమిషాలపాటూ వాయిదా వేశారు. మరోవైపు సభలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పినట్టు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సినిమా కాదంటూ ఫైర్​ అయ్యారు. అంబటి వర్సెస్​ టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డి సభలో తొడగొట్టినట్టు సమాచారం.

వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం
సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. తన తండ్రి మీద చెప్పులు వేయించిన వ్యక్తికి బాలకృష్ణ ఎలా సపోర్ట్ చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తాము చంద్రబాబు అరెస్ట్​ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు అన్నారు. తమ సభ్యులను టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారని.. తమవారు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందని అంబటి హెచ్చరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం అంబటిపై విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యులు సరైన ఫార్మాట్​ లో వస్తే తాము చర్చించేందుకు రెడీగా ఉన్నామని అంబటి అన్నారు. తెలుగుదేశం సభ్యులు కావాలనే సభలో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా ఎమ్మెల్యే బాలకృష్ణ తొడగొట్టడం, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్​ రెడ్డి తొడగొట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img