– బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి
ఇదేనిజం, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పరిధి దాటి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవాకులు చివాకులు పేలడం సరికాదన్నారు. తెలంగాణలో ఇన్నేళ్లు ప్రజాస్వామిక పాలన కొనసాగిందన్నారు. గతంలో చంద్రబాబు పాలించినప్పటి కంటే కేవలం పదేళ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారన్నారు. అలాంటి ప్రజా ప్రభుత్వంపై ఇప్పుడు విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.
చంద్రబాబు నాయుడు పరోక్షంగా హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలను ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా వారు విజ్ఞతతో ఓటు వేశారు. అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఆ విషయం మర్చిపోయి కేసీఆర్‌ది అహంకారం అని మాట్లాడటం బట్టి చూస్తే అసలు అహంకారి ఎవరో ఇక్కడే తెలిసిపోతుందన్నారు. ఈ లెక్కన ఎన్నికల్లో మీరు ఓడిన ప్రతీ ఎన్నికల్లో అహంకారం వల్లే ఓడిపోయారా? ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది సానుభూతి ప్రకటించారన్నారు. కానీ ఇలా అహంకారపూరిత మాటలు మాట్లాడలేదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కేవలం రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం తెలంగాణను అభివృద్ధి చేసిన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇవి మానుకుంటే మంచిదని హితువు పలికారు. లేకపోతే మీ అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు.