Homeహైదరాబాద్latest Newsనకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ఇదే నిజం, వాంకిడి (కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ) : విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో గల మినీ సమావేశ మందిరంలో పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 38 వేల ఎకరాల్లో రైతులు పత్తిని పండిస్తున్నారని తెలిపారు. జిల్లాలో విత్తనాలకు కొరత లేదని, విత్తన డీలర్ల వద్ద ప్రస్తుతం సరిపడా స్టాకు వుందని, రైతులకు జూన్ 25 వరకు విత్తనాలు డీలర్ల వద్ద లభిస్తాయని అన్నారు. జిల్లాకు 6 లక్షల 50 వేల ప్యాకెట్లు అవసరం కాగా ప్రస్తుతం 5 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

నాసిరకం విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు విడిగా విత్తనాలు తీసుకోకుండా, కంపెనీ లోగో వున్న విత్తనాల ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలని, రైతులు విత్తనాలు వేసిన తరువాత ఖాళీ బ్యాగులను, రశీదులను భద్రపరుచుకోవాలన్నారు. లైసెన్సు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలన్నారు. అధిక ధరలకు ఎవరైనా విత్తనాలను విక్రయిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను మాత్రమే చెల్లించాలన్నారు. డీలర్లు తమ లైసెన్సు వివరాలను, విత్తన వివరాల నిల్వలను షాపు ముందు బోర్డుపై ప్రదర్శించాలని తెలిపారు. విత్తనాల నిల్వలు, ఏయే కంపెనీ విత్తనాలు అందుబాటులో ఉ న్నాయో వాటి ధరల పట్టికను ప్రతిరోజు షాపు ముందు ప్రదర్శించాలని తెలిపారు. మండలాల్లో, రెండు డివిజన్లలో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు విత్తనాల అక్రమ రవాణాపై జిల్లాలో ఏడు కేసులను నమోదు చేసి, 26 లక్షల 50 వేల విలువ గల 10 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పత్తి విత్తనాల అక్రమ రవాణా, అధిక ధరలు, నాసిరకం విత్తనాలు డీలర్లు విక్రయించినట్లయితే రైతులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ 6304686505 కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సంచాలకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img