Homeహైదరాబాద్latest Newsఅక్రమ సంబంధాలకు జవాబు

అక్రమ సంబంధాలకు జవాబు

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాలు విధ్వంసాలకు కారణమవుతున్నాయి. కుటుంబాలకు పెనుశాపాన్ని మిగులుస్తున్నాయి. మనుషులు క్రూర మృగాలుగా మారుతున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. భర్తలు తట్టుకోలేక భార్యల్ని హతమార్చారు. ఉప్పల్, బాన్సువాడ, మియాపూర్ ఘటనలు ఉదాహరణలు.

సమాన హక్కులు

ఎంత మంచిగా బతికినా ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు ఆగడం లేదు. దానికి కారణం అనేకం ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇవి పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. స్త్రీ, పురుషులు ఒకేలా జీవించేలా ఉద్యమాలు నడుస్తున్నాయి. భారతదేశంలో కూడా క్రమంగా విదేశీ సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ‘వివాహం అయినా కూడా స్త్రీ తనకి నచ్చిన పురుషునితో సంబంధం పెట్టుకోవచ్చు. పెళ్లి కాకముందు మేజర్లు ఎవరితోనైనా తిరిగే స్వేచ్ఛ ఉంది’ అనే తీర్పులు జనాల్లోకి బాగా వెళ్లాయి. ప్రత్యేకించి కొందరు స్త్రీలకు బాగా కనెక్ట్ అయింది. పెళ్లి అయినా ఇతరులపై ఆకర్షణతో జీవితంలో నిప్పులు పోసుకుంటున్నారు.

కారణాలు

భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక పరిస్థితులు, సంతానలేమి, వరకట్నం, లైంగిక వాంఛ, కుటుంబ పోషణ, సమాజం పట్ల అవగాహన లేమి, కష్టపడేతత్వం కొరవడడం, జల్సాలకు అలవాటుపడటం, అసూయ, అన్నిటికీ మించి అనుమానం. ఇలా ఎన్నో కారణాలతో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. వాళ్ల పిల్లలు, కుటుంబసభ్యులు దిక్కులేనివారవుతున్నారు. అనాథలుగా మిగిలిపోతున్నారు. బంధుమిత్రులకు తీరని శోకాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళుతున్నారు.

రివెంజ్

తను ఎంతగానో ప్రేమగా చూసుకునే భాగస్వామి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే విషయం తెలుసుకొని మానసికంగా కుంగిపోతున్నారు. సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ తర్వాత దగ్గరివాళ్లే దూరం పెడుతున్నారు. అయినవాళ్ల నుంచి అవమానాలు. బంధుమిత్రుల నుంచి ఆదరణ కరవు. ఒంటరిగా మిగిలిపోవాల్సిన దుస్థితి. చేసేదేమీ లేక చివరిగా రివెంజ్. ఇదీ పరిస్థితి. హద్దులుమీరి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. గొడ్డల్లతో నరకడం, ఉరేయడం, కత్తులతో కోయడం, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం..ఇలా ఏదో విధంగా మరణమే జవాబుగా అనుకొని పొరపాటు చేస్తున్నారు.

మార్పు అంటే

ప్రస్తుత ప్రపంచం మనిషి ఉహకు అందనంత వేగంగా పరుగెత్తుతోంది. నిత్యం మార్పులు జరుగుతున్నాయి. మానవ జీవనశైలి, ఆహార్యం, అభిరుచి, ఇష్టాలు ఇలా క్షణకాలంతో మారుతున్నాయి. ఎంత ఛేంజ్ అయినా మార్పు ఎంతవరకు అవసరమో అంతవరకే గ్రహించాలి. మన వ్యక్తిత్వాన్ని, బుద్ధిని, మనస్సును దిగజార్చే మార్పు మార్పు కాదు. ఇది గ్రహించని వాళ్లే సమాజంలో తప్పులు చేస్తున్నారు. ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దేది మార్పు. అభివృద్ధిని కాంక్షించేది మార్పు.

తెలివైనవారు తగ్గుతారు

పెళ్లి భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్య విషయం. అన్నిటికంటే ప్రధానమైనది. గొప్పది. జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటారు. దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. జీవితాన్ని సరిదిద్దుకోవాలి. భార్య భర్తలు తమ ఇష్టాయిష్టాలను తెలుసుకొని సర్దుకోవాలి. వారి సలహాలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమాత్రం భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. తెలివైనవారు తగ్గుతారు. ఈగో ఎప్పుడు కూడా పనికి రాదు. అది మన క్యారెక్టర్‌ను దిగజారుస్తుంది. వర్రీస్, బాధలు వంటివాటిని తలుచుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని కోల్పోతున్నవారు ఎందరో.

సంతోషమే విజయానికి దారులు

మంచి రిలేషన్స్ ఏర్పరచుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లతో ఉంటే లైఫ్‌లో సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆనందంగా ఉన్న మనసు మాత్రమే గొప్ప విజయాలను సాధించగలదని పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నోసార్లు రుజువు కూడా అయింది. మీ లైఫ్‌లో, మీరు కంట్రోల్ చేయలేని విషయాల పట్ల చింతించాల్సిన అవసరం లేదు. క్షణికావేశానికి పోకుండా కాస్త కూల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేంజెస్‌ని గ్రహించి జాగ్రత్తపడితే మేలు. ఎంత గొప్ప వ్యక్తికైనా కష్టకాలమనేది వస్తుంది. ఆ సందర్భాల్లో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలే తప్ప హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారం కావు.

గమనిక : ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న నేరాలను అరికట్టడంలో భాగంగా రచయిత చేసిన ప్రయత్నం.

Recent

- Advertisment -spot_img