Homeజాతీయంరాజస్థాన్​ సీఎం రేసు నుంచి తప్పుకున్న బాబా బాలక్​ నాథ్

రాజస్థాన్​ సీఎం రేసు నుంచి తప్పుకున్న బాబా బాలక్​ నాథ్

– సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాబా
– కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న సస్పెన్స్

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఫలితాలు వెలువడి వారం రోజులు కావొస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగి.. పరిశీలకుడిని నియమించింది. రాజస్థాన్‌ పరిశీలకుడిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నియామకమయ్యారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రిగా వసుంధర రాజే, కిరోరి లాల్ మీనా, బాబా బాలక్‌నాథ్, గజేంద్ర సింగ్ షెకావత్, దియా కుమారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని సీఎంను ఎంపిక చేయనున్నారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా బాలక్‌నాథ్‌ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అనూహ్యంగా ఆయన బరిలో నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా తెలిపారు. తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికే సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చలను పట్టించుకోవద్దని.. తాను ఇంకా అనుభవం సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తరహాలోనే బాబా బాలక్‌నాథ్‌ సైతం రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేసులో లేనని వెల్లడించినట్లయ్యింది. ప్రస్తుతం సీనియర్‌ నాయకురాలు వసుంధర రాజే, కిరోరి లాల్‌ మీనా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, దియా కుమారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆదివారం జరిగే సీఎల్పీ సమావేశంలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ నెల 16లోగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉండనున్నది పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recent

- Advertisment -spot_img