Homeఅంతర్జాతీయంచెవుడుకు పరిష్కారం చెప్పిన గబ్బిలాలు #Deaf #Bats

చెవుడుకు పరిష్కారం చెప్పిన గబ్బిలాలు #Deaf #Bats

శాస్త్ర-సాంకేతిక రంగంలోని ప్రధాన ఆవిష్కరణలు ప్రకృతిలోని జీవరాశుల నుంచి స్ఫూర్తిపొంది రూపొందించినవే.

గాలిలో ఎగిరే పక్షులను చూసి విమానాలను, నీటిలో ఈదే చేపలను ఆధారంగా చేసుకొని ఓడల నిర్మాణాన్ని చేపట్టారు.

అయితే, జీవన పోరాటంలో భాగంగా ఆహారం కోసం వెదుక్కునే ఓ గబ్బిలం.. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మందిని వేధిస్తున్న వినికిడి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించిందంటే నమ్మగలమా? ఇది నిజం.

యంత్రాల ద్వారా వినికిడి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించినప్పటికీ, శాశ్వతమైన చికిత్స కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో రాత్రిపూట, దట్టమైన చీకటి ప్రాంతాల్లో ఆహారం కోసం వెదికే గబ్బిలాలు ఎకోలొకేషన్‌ టెక్నిక్‌తో (ప్రతిధ్వనుల సాయంతో ఆహారం, పరిసరాల ఆనవాళ్లను చీకట్లోనే అంచనా వేయడం) చేస్తున్న కొన్ని ధ్వనులను చైనాలోని శాస్త్రవేత్తలు పరిశీలించారు.

140 డెసిబెల్స్‌ రేంజ్‌లో (జెట్‌ విమానం చేసే శబ్దం) ఉన్న ఆ ధ్వనులను తట్టుకొని కూడా వినికిడి సమస్యలేకుండా ఆ జీవులు ఎలా ఉంటున్నాయో వారికి అర్థంకాలేదు.

దీంతో లోతుగా ప్రయోగాలు చేశారు. (80 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ తీవ్రత గల ధ్వనులను క్షీరదాలు వింటే వాటిలో వినికిడి సమస్య తలెత్తుతుంది)

అదే కారణం..

ఎకోలొకేషన్‌ సాయంతో ఆహారాన్ని వెదుకుతున్న గబ్బిలాల చెవి అంతర భాగాల్లో ‘ఐఎస్‌ఎల్‌1 (ఐఎస్‌లెట్‌1)’ అనే ప్రత్యేక జన్యు పదార్థం తయారవుతున్నట్టు పరిశోధకులు గమనించారు.

కఠోర ధ్వనుల నుంచి చెవిలోని కోచ్‌లియర్‌ హెయిర్‌ కణాలను (వినికిడి శక్తిని నియంత్రించే కణాలు) రక్షించడంలో ఇది సాయపడుతున్నట్టు గుర్తించారు.

ఎకోలొకేషన్‌ సాయంతో ఆహారాన్ని వెదుకుతున్న గబ్బిలాలలాగే, పండ్లను తిని బతికే ఫ్రూట్‌ గబ్బిలాలు, ఎలుకలు కూడా ఈ కఠోర ధ్వనులను తట్టుకుంటాయో లేదోనని పరీక్షలు జరిపారు.

రెండుగంటలపాటు 120 డెసిబెల్స్‌ రేంజ్‌లో తీవ్రమైన శబ్దాలను ప్రసారం చేశారు. దీంతో ఫ్రూట్‌ గబ్బిలాలు, ఎలుకల్లో వినికిడి సమస్య తలెత్తింది.

ఆ జీవుల్లో ‘ఐఎస్‌ఎల్‌1’ జన్యు పదార్థం తయారవకపోవడంవల్లే ఇది జరుగుతున్నట్టు గుర్తించారు.

‘ఐఎస్‌ఎల్‌1’ను వినికిడి సమస్యగల వారికి అందిస్తే సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని అంచనా వేశారు. త్వరలో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img